భారీ వర్షాలు, వాతావరణంలో మార్పులు.. చెలరేగుతున్న ఈగలు, దోమలు.. దీనికి తోడు పారిశుధ్య సమస్యలతో ప్రజలు దవాఖాన బాట పడుతున్నారు. సీజనల్ వ్యాధులు ఉమ్మడి జిల్లాలో పెరిగిపోతున్నాయి. ఇప్పటికే డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, టైఫాయిడ్ కేసులు నమోదు కాగా, విష జ్వరాల బారినపడిన రోగులతో దవాఖానలు కిక్కిరిసిపోయాయి. పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్య సమస్యలు పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఉమ్మడి జిల్లాలోనెల రోజులుగా 152 డెంగీ, 190 మలేరియా కేసులు నమోదు కావడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నది.
– వనపర్తి, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ)
వర్షాకాలమంటేనే వ్యాధుల కాలం. దీనికి తోడు పల్లెల్లో సర్పంచుల పదవీకాలం పూర్తయ్యి ప్రత్యేకాధికారుల పాలన ఉండడంతో పారిశుధ్యంపై పట్టింపే లేదు. పట్టణాల్లోనూ భారీ వర్షాల కారణంగా మురుగు చేరి ప్రజలు విషజ్వరాలబారిన పడుతున్నారు. దీంతో వైరల్ ఫీవర్‌తో దవాఖాన బాట పట్టిన రోగులకు వైద్య సహాయం సైతం అందడం లేదు. ముసురు వర్షాలకు దోమలు పెరిగి రోగాలకు ఊతమిచ్చినట్లయ్యింది. వనపర్తి జిల్లాలో 13 పీహెచ్సీలుండగా, మరో 4 సీఈసీలు, 2 అర్బన్ పీహెచ్‌సీలు, 2 బస్తీ దవాఖానలతోపాటు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ దవాఖాన ద్వారా జిల్లా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు.
రెండు నెలల్లో 22 కేసులు..
వనపర్తి జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. జూలై నెల నుంచి జిల్లాలో మొదలైన కేసులు ఆగస్టులో క్రమంగా పెరుగుతున్నాయి. వైరల్ ఫీవర్‌తో వచ్చే రోగులకు డెంగీ పరీక్షలు నిర్వహించడంతో ఇవి బయట పడుతున్నాయి. గ్రామాల నుంచి వచ్చే రోగులకు ప్రాథమిక దవాఖానలో అందుబాటులో ఉన్న చికిత్స చేసి జిల్లాకు పంపిస్తున్నారు. డెంగీ నిర్ధారణకు కా వాల్సిన కిట్లు పీహెచ్‌సీలకు అవసరమైన మేరకు రా వడం లేదన్న విమర్శలున్నా యి. పగటి పూట కుట్టే ఏడీఎస్ ఈజిప్టి(టైగర్ దోమ)ద్వారా డెంగీ జ్వరం వ్యాప్తి చెందుతున్నది.
ఎటు చూసినా విషజ్వరాలే..
జిల్లాలో ఏ దవాఖాన చూసినా విషజ్వరాల బాధితులే అధికమయ్యారు. ఒక్కసారిగా ఓపీ రే టు పెరిగి పోయింది. జిల్లా దవాఖానకు రోజూ వచ్చే వారి సం ఖ్య 600ఉండగా, ప్రస్తుతం వెయ్యికి చేరుకున్నది. మండల స్థాయిలోనూ రోగుల సంఖ్య భారీగానే పెరిగిందని చెప్పవచ్చు. సీహెచ్‌సీ స్థాయిలో రెం డు వందలు, పీహెచ్సీ స్థాయిలో వందకు తగ్గకుండా రోగులు వస్తున్నారు. మండల స్థాయిలో వైద్య సేవ లు మందకొడిగా అందుతున్నాయన్న ఆరోపణలున్నాయి. మధ్యాహ్నం తర్వాత డాక్టర్లు అందుబాటు లో ఉండడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. జి ల్లాలో విష జ్వరాల బారిన పడ్డ రోగుల సంఖ్య వం దల్లో ఉండగా, మలేరియా కేసులు నమోదు కాలేదు. అలాగే డయేరియా, టైఫాడ్ కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తున్నది.
పారిశుధ్య చర్యలు శూన్యం..
గ్రామాల్లో వర్షాల కారణంగా దోమల బెడద పెరుగుతున్నది. మున్సిపాల్టీ పరిధిలో అప్పుడప్పుడు ఫాగింగ్ చేస్తుండగా, గ్రామాల్లో ఫాగింగ్ మిషన్లు మూలకు చేరాయి. వీటిని మరమ్మతులు చేయాలన్నా గ్రామ పంచాయతీల్లో నిధులు లేక వెలవెల బోతున్నాయి. ఇప్పటి వరకే పెట్టుకున్న ఖర్చులు రాక పంచాయతీ కార్యదర్శులు బిక్కమొఖం వేస్తున్నారు. ట్రాక్టర్ మెయింటెనెన్స్‌తోపాటు ఇతర అత్యవసరాలకు తమ స్థాయికి మించి ఖర్చులు చేస్తున్నామన్న ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. జిల్లాలో 268 గ్రామ పంచాయతీలుండగా, స ర్పంచుల పదవీకాలం ముగిసి రెండేళ్లు కావస్తున్నా ఎన్నికలు లేవు. దీంతో గ్రామాల్లో పారిశుధ్యపనులు చేపట్టడం లేదు.
చికిత్స అందిస్తున్నాం..
జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండటం వల్ల వివిధ రకాల రోగాల వ్యాప్తికి కారణమవుతున్నది. డెంగీ కేసులను గుర్తించిన గ్రామాల్లో ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటున్నాం. జిల్లాలో 20కేసులకు పైగా నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జనవరి నుంచి ఇప్పటి వరకు 5వేల మంది వరకు డెంగీ పరీక్షలు నిర్వహించాం.