మద్దూర్ : అభివృద్ధి పనుల్లో భాగంగా దుకాణాలను తొలగించిన(Demolitions) అధికారుల తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన ( Protest ) తెలిపారు. మద్దూరు పట్టణ కేంద్రంలో ప్రధాన రహదారులను రెండు లైన్లుగా మార్చే క్రమంలో రెండు గంటల చౌరస్తా నుంచి కన్యక పరమేశ్వరి దేవాలయం వరకు ఇరువైపు 35 ఫీట్ల చొప్పున మొత్తం 70 ఫీట్ల రహదారిని విస్తరించే పనులను శనివారం అర్ధరాత్రి ముందస్తు సమాచారం లేకుండా ప్రారంభించారు.
రేణుమట్ల చౌరస్తా నుంచి ప్రభుత్వ ఆసుపత్రి ప్రహరీ గోడ వైపు 35 ఫీట్లు దాటి అవతలి వైపు మిగిలిన ఉన్న దుకాణాలను రాత్రికి రాత్రి ఎలాంటి సమాచారం లేకుండా జేసీబీలతో కూల్చివేయడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 35 ఫీట్లు తొలగించిన కూడా మిగతా భాగాన్ని ఎవరికి చెప్పకుండా తొలగించడం ఏంటని ప్రశ్నించారు. సమాచారం ఇచ్చి దుకాణంలోని, మిషనరీ, షెడ్డు సంబంధిత సామాగ్రిని తీసుకునే వారమని వాపోయారు. పట్టణ కేంద్రంలోని పాత బస్టాండ్ లో షాపులు కోల్పోయిన బాధితులు నష్టపరిహారం చెల్లించాలని రోడ్డుపై బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ధర్నాను విరమింపజేశారు.