లింగాల, ఫిబ్రవరి 22: మండలంలోని అంబట్పల్లిలో సర్వేనెంబర్ 732లో 5.29గంటల భూమి ఉన్నది. అందులో కొంతమేరకు అక్రమంగా నిర్మించిన ప్రహరీ నిర్మాణాన్ని పోలీసుల బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు జేసీబీ సహాయంతో శనివారం తెల్లవారుజామూన కూల్చివేసిన ఘటన చోటుచేసుకున్నది. వారం రోజుల కిందట జిల్లా, మండల సర్వేయర్లు వచ్చి సర్వే చేసి మార్కు వేశారు. అక్రమ నిర్మాణాన్ని తొలగించడానికి గురువారం రెవెన్యూ అధికారులు రాగా.. బాధితులు, గ్రామస్తులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు.
కాగా జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాసీల్దార్ పాండునాయక్, ఎంఆర్ఐ సీతారాం శనివారం తెల్లవారుజామూన 4గంటల సమయంలో ప్రహరీ నిర్మాణాన్ని తొలగించారు. ప్రహరీ తొలగిస్తుండగా అధికారులు, సింగిల్ విండో చైర్మన్ హన్మంత్రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. కొంత సమయం ఇవ్వాలని సింగిల్ విండో చైర్మన్ అధికారులను విన్నమించుకున్నా.. పోలీసులు అడ్డొచ్చిన వారిని నెట్టివేసి అక్రమ నిర్మాణాన్ని కూలగొట్టారు. 732 సర్వేనెంబర్లో అక్రమ కట్టడాలు నిర్మిస్తే ఎవరు అడ్డువచ్చినా ఆపే ప్రసక్తే లేదని తాసీల్దార్ పాండునాయక్ సూచించారు.