కల్వకుర్తి, జనవరి 17 : ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం ప్రకారం పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయి.. లేని పక్షంలో రైతులకు క్షమాపణలు చెప్పి ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్ దిగిపో.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రైతులు ర్యాలీ నిర్వహించారు. రుణమాఫీ చేయకుండా.. రైతు భరోసా ఇవ్వకుండా రైతుల జీవితాలతో చెటగాటమాడుతున్నావని రైతులు మండిపడ్డారు. రైతులు తిరగబడేలోపే ఇచ్చిన హామీలు అమలు చేయ్.. లేకుంటే నీకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రుణమాఫీ సాధన సమితి కార్యచరణలో భాగంగా శుక్రవారం రుణమాఫీకి నోచుకోని రైతులు జేఏసీ చైర్మన్ రాంచంద్రారెడ్డి అధ్యక్షతన కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో సమావేశమయ్యారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా మార్కెట్ యార్డు నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం పరిపాలనాధికారికి వినతిపత్రం అందజేశారు. దాదాపు కిలోమీటర్‌కు పైగా నిర్వహించిన ర్యాలీలో రైతులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నమ్మించి రైతులను మోసం చేసిన పార్టీ ప్ర పంచంలో ఏదైనా ఉం దం టే అది కాంగ్రెస్ పార్టీయేనని దుయ్యబట్టారు. ఎ న్నికలకు ముందు రై తులను పువ్వుల్లో పె ట్టి చూసుకుంటామని చెప్పి, రు ణమాఫీ రూ.2లక్షలు చేస్తామని, రైతులకు ఎకరాకు రూ.15వేలు ఇస్తామని డిక్లరేషన్లు ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక రైతుల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు.
రుణమాఫీతోపాటు రైతు భరోసా ఇవ్వాలి..
రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేయడంతోపాటు వానకాలం, యాసంగి పంటలకు రైతు భరోసా ఇవ్వాలని రుణమాఫీ సాధన సమితి జేఏసీ చైర్మన్ రాంచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికీ రుణమాఫీ 50శాతం మంది రైతులకు ఇవ్వలేదని, గత నెలలో నాలుగో విడుత రుణమాఫీ జాబితా విడుదల చేశారని అందులో కేవలం 10 శాతం రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయలేదని దుయ్యబట్టారు. రుణమాఫీ వస్తుందనే నమ్మకంతో చాలామంది రైతులు రుణఖాతాలను రెన్యూవల్ చేసుకోలేదని, ఇప్పుడు అసలు, మిత్తి తడిసి మోపెడైందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే తలోమాట మాట్లాడుతూ రైతుల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుభరోసా వానకాలం, యాసంగి కలిపి ఇవ్వాలన్నారు. పాలిచ్చే బర్రెను వదిలేసి తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్లు రైతుల పరిస్థితి తయారైందని వాపోయారు. పోసిన పాలకు కూడా బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారని, పాడిని నమ్ముకుని బతుకులీడిస్తున్న రైతుల పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు.
పాలమూరు చౌరస్తాలో ఉత్కంఠ..
పాలమూరు చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను ఎమ్మెల్యే నారాయణరెడ్డి ప్రారంభిస్తున్న సమయంలోనే రైతుల ర్యాలీ అక్కడకు చేరుకున్నది. ఎమ్మెల్యేను చూసిన రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రె ట్టించిన ఉత్సాహంతో నినాదాలు చేశారు. రైతు మోసకారి ప్రభుత్వం నశించాలి.. అంటూ నినాదాలు చేయడంలో కాస్తంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్యక్రమం ముగించుకొని ఎమ్మెల్యే వెళ్లిపోగా.. రైతుల ర్యాలీ ఆర్డీవో కార్యాలయం వైపు సాగింది.
కార్యక్రమంలో రైతు జేఏసీ నాయకులు కృష్ణారెడ్డి, పెద్దయ్యయాదవ్, జంగయ్య, తిరుపతిరెడ్డి, యాదగిరిరెడ్డి, రాంరెడ్డి, కిశోర్, లిం గం, అల్వాల్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డితోపాటు కల్వకుర్తి రెవెన్యూ డివిజన్‌కు చెందిన రైతులు పాల్గొన్నారు.