గద్వాల, ఫిబ్రవరి 14 : ఉచిత స్కూటీ హామీ అమలు ఏమైందంటూ జిల్లా కేంద్రంలోని ఎంఏఎల్‌డీ, ఎస్వీఎం డిగ్రీ కళాశాల విద్యార్థినులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. పోస్టుకార్డులపై ప్రియాంకజీ ఎక్కడ నా స్కూటీ అంటూ ఉత్తరాలు రాసి ప్రియాంక గాంధీకి పోస్టు చేశారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు అఖిల, వైష్ణ వి, ఆసియా తదితరులు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎ న్నికల హామీల్లో భాగంగా 23మే 2023 సరూర్‌నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించి 18 ఏండ్లు నిండిన ప్రతి అమ్మాయికి ఉచితంగా ఎలక్ట్రికల్ స్కూటీతోపాటు మహిళలకు రూ.2500 ఇస్తామని ప్రకటించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు.
మాయమాటలతో రాష్ట్రం లో ఉన్న విద్యార్థినుల కుటుంబాలు కోటి ఆశలతో కాంగ్రె స్ పార్టీకి ఓటు వేసి అధికారంలోకి తెస్తే అధికారంలోకి వచ్చి 14నెలలు కావస్తున్నా స్కూటీల ఊసెత్తడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు ప్రియాంక గాంధీ అబద్ధ్దాలకు అలవాటు పడ్డారని విమర్శించారు. ఇటు మహిళలు, అటు విద్యార్థులకు అమలు కాని హామీ లు ఇచ్చి వారిని మోసం చేశారని ఆరోపించారు. విద్యార్థినులకు ఉచిత స్కూటీలు లేవు మహిళా భరోసా రూ. 2500 లేదు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా తులం బంగారం ఇస్తామని చెప్పి ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రజలను మోసం చేయడానికే హమీలన్నారు.
హామీలను నమ్మి అందరం ప్రస్తుతం గోస పడుతున్నామని ఆరోపించారు. ప్రియాంకగాంధీ మహిళ అయి ఉండి మహిళలు, విద్యార్థినులను ఎలా మోసం చేయాలనిపించిందని మం డిపడ్డారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎలక్ట్రిక్ స్కూటీ హామీని సాధించేంత వరకు పోస్టుకార్డుల ద్వారా నిరసన తెలియజేసి పెద్ద ఎత్తున ఉద్యమించి విద్యార్థినులకు హక్కుగా రావాల్సిన స్కూటీలను ఇచ్చేవరకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి సాధించుకుంటామన్నారు. మోసపూరిత కాంగ్రెస్ నాయకుల మాటలు ఇక ఎవరు నమ్మొద్దని సూచించారు. వీరికి బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య సంఘీభావం తెలిపారు.