హన్వాడ, మార్చి 18 : మండలంలోని దాచక్పల్లి గ్రామ సమీపంలో సర్వే నెం 36లో తమకు భూమి హక్కు కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. భూమి హక్కు కల్పించే విషయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలను తాసీల్దార్ పట్టించుకోవడం లేదని మంగళవారం తాసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్వాల్రెడ్డి మాట్లాడుతూ దాచక్పల్లి గ్రామ సమీపంలోని సర్వే నెం 36లో 6ఎకరాల 16 గుంటల భూమి ఉందని, వీటిలో ఒకభాగం కర్రె బాలప్ప కుమారులు పెద్ద భీమయ్య, చిన్న చెన్నయ్య, వీరయ్య, నాగయ్య, బాలకిష్టయ్య అందరూ కలిసి 2ఎకరాల 8గుంటల భూ మిని ఓ గిరిజన వ్యక్తికి అమ్ముకున్నారు.
కానీ ఈయనకు 3ఎకరాల 18గుంటల భూమి రిజిస్ట్రేషన్ అయిం ది. రెండో భాగంలో మిగతా 3 ఎకరాల 8గుంటల భూమి మునెమ్మ, కర్రె సాయన్న, టంకర సాయన్న పేర్ల మీద ఉండగా కర్రె బాలప్ప కుమారులు అక్రమంగా సాగు చేసుకుంటున్నారు. అట్టి భూమి కర్రె సాయన్న, టంకర సాయన్న, మునెమ్మలకు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇది వరకు కలెక్టర్కు ఫిర్యాదు చేయగా రెవెన్యూ అధికారులు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టాలని అర్హులకు హక్కులు కల్పించాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. అయినా తాసీల్దార్, డిప్యూటీ తాసీల్దార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు విచారణ నిర్వహించి అర్హులకు భూమి ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని లేనిచో రిలే నిరాహారదీక్షలకు పూనుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో భీమ య్య, చెన్నయ్య, రాములు, వెంకటయ్య, మునెయ్య, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.