అడవి తల్లి ఒడిలో ఆహ్లాదాన్ని అందించేందుకు ఏక్లాస్పూర్ ఎకో పార్కు సిద్ధమైంది. నారాయణపేట మండలంలోని అటవీ ప్రాంతంలో రూ.2 కోట్ల వ్యయంతో కను‘బొమ్మలు’ మెరిసేలా.. 200 ఎకరాల ‘ఆనంద’నవనంలోసుందరం గా నిర్మించారు. వాటర్ కన్జర్వేషన్, అవెన్యూ ప్లాంటేషన్, థీమ్, రాశి పార్కులు సందర్శకులకు కనువిందు చేసేందుకు సిద్ధమయ్యాయి. ప్రకృతి అందాలను ఆస్వాదించి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కాసేపు సరదాగా గడిపేలా తీర్చిదిద్దారు.
నారాయణపేట, డిసెంబర్ 15 : చిన్నాపెద్ద తేడా లేకుండా పచ్చనిచెట్లు, ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రశాంత వాతావరణంలో గడిపేందుకు గత కేసీఆర్ సర్కారు ఎకో పార్కులను ఏర్పాటు చేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం అటవీశాతాన్ని పెంచడంతోపాటు పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు 2020లో ఏర్పాటు చేసిన ఎకో పార్క్‌లో చిన్నారుల ఆటవిడుపుతోపాటు వివిధ జంతువుల ఆకృతుల్లో ఏరాటు చేసిన బొమ్మలు చూపరులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. నారాయణపేట జిల్లాలో కేవలం 3శాతం అటవీ ప్రాంతం ఉంది. అందులో పట్టణానికి దగ్గరలో ఉన్న ఏక్లాస్పూర్-మినాస్‌పూర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఎకో పార్క్ ఏర్పాటు చేస్తే ప్రజలకు అనువుగా ఉంటుందనే ఉద్దేశంతో 2020లో పార్క్ ఏర్పాటుకు మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి కృషితో శ్రీకారం చుట్టింది గత ప్రభుత్వం. ఏక్లాస్‌పూర్‌లో రూ.2కోట్లతో 200 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్క్‌ను మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. జిల్లా కేంద్రం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏక్లాస్పూర్ వేంకటేశ్వరస్వామి (తిమ్మప్పస్వామి) ఆలయం వెనుక భాగంలో గల అటవీ ప్రాంతంలో పెద్ద గుట్టల మధ్యన ఎకో పార్క్‌ను నిర్మించారు. సందర్శకులను ఆకట్టుకునేలా రూ.2కోట్లతో పనులు చేపట్టారు.
పిల్లల ఆట విడుపునకుతోడు చిన్నారుల నుంచి పెద్దల వరకు ఆహ్లాదం పంచేందుకు పార్క్‌లో అన్ని సదుపాయాలు కల్పించారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పచ్చనిచెట్ల మధ్యన సేద తీరేందుకు ప్రకృతి అందాలతో వేదికగా ఎకో పార్క్ మారింది. ప్రధాన గేటు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆర్చీ అందరినీ ఆకట్టుకునేలా రూపొందించారు. పార్క్‌లో సందర్శకులు, పర్యాటకులు విడిది చేయడానికి సిమెంట్ కూర్చీలను ఏర్పాటు చేశారు. పార్క్‌లో వాటర్ కన్జర్వేషన్, అవెన్యూ ప్లాంటేషన్, థీమ్ పార్క్, రాశి పార్క్‌లను ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ మాదిరిగా నారాయణపేట జిల్లా ప్రజలకు ప్రకృతిని ఆస్వాదించేందుకు అన్ని సదుపాయాలను కల్పించారు.