గద్వాల, జూన్ 21 : వానకాలం సాగుకు రైతులు తమ పొలాలు సిద్ధం చేస్తున్నారు. కాగా రుతుపవనాల ఆలస్యంతో వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్ పంటలకు సంబంధించి జిల్లా వ్యవసాయ అధికారులు ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. జిల్లాలో సాగునీరు పుష్కలంగా ఉండడంతో ఈసారి రైతులు వివిధ పంటల సాగు ఎక్కువగా చేస్తారని అధికారులు అంచనా వేసి ప్రణాళిక రూపొందించారు. తుమ్మిళ్ల, ఆర్డీఎస్, జూరాల, నెట్టెంపాడ్ ప్రాజెక్టుల నుంచి నీటిని రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేసి అక్కడి నుంచి చెరువులను నింపితే వాటికింద ఆయకట్టు పెరిగే అవకాశం ఉందని గుర్తించారు. దీనికి తోడు బోర్లు, బావుల్లో నీటిశాతం పెరగడంతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ఎరువుల వినియోగాన్ని కూడా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. గతంలో ఎరువుల కోసం రైతులు నానా ఇబ్బందులు పడేవారు. నాటి ప్రభుత్వాలు రైతులకు అనుకున్న స్థాయిలో ఎరువులు అందించడంలో విఫలమయ్యాయి. ఎరువుల కోసం రైతులు వ్యవసాయశాఖ కార్యాలయాల వద్ద పడిగాపులు కాసేవారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు నీటిగోస తీరడంతోపాటు అవసరమైన ఎరువులను గోదాంలో అందుబాటులో ఉంచుతుండడంతో రైతులు ధైర్యంగా సాగుకు సన్నద్ధమవుతున్నారు. తొలకరి పులకరిస్తే రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యేందుకు సిద్ధమయ్యారు. ప్రతి ఐదువేల ఎకరాలకో క్లస్టర్ ఏర్పాటు చేసి ఏఈవోలను కేటాయించడం కూడా సాగు పెరగడానికి మరో కారణమైంది.
జిల్లాలో ప్రధాన పంటల సాగు..
వానకాలంలో జోగుళాంబ గద్వాల జిల్లాలో ఎక్కువ శాతం ప్రధాన పంటలైన పత్తి, వరి, వేరుశనగ, పెసర, మొక్కజొన్న, కంది, ఆముదం, పొద్దుతిరుగుడు, అనుములు, మిర్చి, ఉల్లి పంటలు సాగు చేస్తారు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలోని 12 మండలాల్లో సాగుకు సంబంధించిన ప్రణాళికలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. జిల్లాలో వానకాలంలో 3.48లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగుచేయనున్నారు. అందుకు అవసరమైన ఎరువులు, విత్తనాలకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు డీఏవో గోవిందునాయక్ తెలిపారు.
జిల్లాలో పంటల సాగు ఇలా..
రైతులు ఈ ఏడాది పత్తి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. జిల్లా మొత్తంగా 2.15లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయనున్నట్లు అధికారుల అంచనా. గత వానకాలంలో పత్తి పంటను 1,78,650 ఎకరాల్లో సాగు చేశారు. అదేవిధంగా వరి పంటను 68,219 ఎకరాల్లో సాగు చేయగా ఈ ఏడాది 82,100 ఎకరాల్లో సాగు చేయనున్నారు. కందులు 15,190 ఎకరాల్లో, మొక్కజొన్న 15వేల ఎకరాల్లో, వేరుశనగ 7,500 ఎకరాల్లో, ఆయిల్ సీడ్స్‌కు సంబంధించి 9,130 ఎకరాల్లో, ఇతర పంటలు 11,580 ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు.
పత్తి వైపే మొగ్గు..
రైతులు అధికంగా పత్తి పంటను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పత్తికి ప్రభుత్వం గరిష్ఠ మద్దతు ధర ఇస్తుండడంతోపాటు మార్కెట్లోనూ ఎక్కువ ధర పలుకుతున్నది.వ్యవసాయశాఖ అధికారులు కేవలం నల్లరేగడిలోనే పత్తి పంట సాగు చేయాలని సూచిస్తున్నా రైతులు మాత్రం అంతటా పత్తి పంటనే సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది నీటివనరులు, మద్దతు ధరను అంచనా వేసుకొని 2.15లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయనున్నారు. గత వానకాలం కంటే ఈసారి అదనంగా 36,350 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయనున్నారు.
సిద్ధంగా ఎరువులు
రైతులకు అవసరమైన ఎరువులను అధికారులు సిద్ధంగా ఉంచారు. జిల్లాలో ప్రస్తుతం ఈ వానకాలానికి సంబంధించి 1.03 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేశారు. అందులో యూరియా 32,680 మెట్రిక్ టన్నులు, డీ ఏపీ 12,017, పొటాష్ 6,615, సూపర్ 3,575, కాంప్లెక్స్ ఎరువులు 47,628 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అంచనా వేశారు. మొదటి విడుత మందులు చల్లుకునేందుకు అవసరమైన నిల్వలను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది.