పాలమూరు, మార్చి 23: మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం రాత్రి కురిసిన ఆకాల వర్షానికి వరి రైతులు భారీగా నష్టపోయారు. ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానకు మహబూబ్‌నగర్ రూరల్ మండలం బొక్కలోనిపల్లి, చౌదర్పల్లి, జమిస్తాపూర్, తెలుగుగూడెం, కోడూరులో వరిపంట చెల్లాచెదురైంది. వడగండ్ల చిన్నచిన్న రాళ్ల మాదిరిగా పడడంతో వరిపంట నేలపాలైంది. 25రోజులు అయితే కోసి తినే సమయానికి పంటలో పండిన వడ్లు వడగండ్లకు నేలపాలయ్యాయి. గ్రామాల్లో ఎ క్కడ చూసిన రైతుల ఏడుపులే కనిపించాయి. అకా ల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బోరున విలపించారు. ఎకరాలకొద్దీ సాగుచేసి చేతికొచ్చిన పంట నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం పెట్టుబడికి రైతుభరోసాను కూడా ఇవ్వలేదని అప్పులు చేసి వరి పంట సాగుచేస్తే అకాల వర్షానికి పంట నేలపాలైందని బాధపడుతున్నారు. కౌలు రైతులు కౌలుకు, పంట పెట్టుబడికి అప్పు చేసి పండించిన పంట నేలపాలైందని విలపించారు. ప్రభుత్వం ప్రతిరైతు పంటను పరిశీలించి వారికి నష్టపరిహారం అందించాలని ప్రజలు కోరుతున్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ఆదివారం ఉదయం బొక్కలోనిపల్లి, జమిస్తాపూర్, తెలుగుగూడెంలో వడగండ్ల వానకు పాడైన వరి పంటలను పరిశీలించారు. బొక్కలోనిపల్లిలో కౌలుకు తీసుకొని వరిపంట సాగుచేసిన మహిళా రైతు జ్యోతి మాజీ మంత్రి గ్రామంలోకి రాగానే బోరున విలపిస్తూ తమను ఆదుకోవాలని కంటతడి పెట్టుకుంది.
రైతును చూసి చలించిన మాజీ మంత్రి వెంటనే తక్షణ సాయం కింద రూ.5వేలు అందజేశారు. వ్యవసాయ అధికారులకు రైతులు ఫోన్ చేస్తే సెలవుల్లో ఉన్నామని చెప్పగా.. ఎవరూ రాలేదని మాజీ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్వయంగా అధికారులకు ఫోన్‌చేసి వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై అంచన వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతాంగం దిక్కుతోచని పరిస్థిలో ఉందని తిండితిప్పలు లే కుండా నాటు పెట్టుకు న్న రైతులకు కోత దశలో ఉండగా వడగండ్ల వాన కారణంగా వరి పంటలు దెబ్బతిన్నాయన్నారు.
వడగం డ్ల వాన కారణంగా వరిపంటలు దెబ్బతిన్న రైతులు నష్టపోతే అధికారులు ఎవరూ రాలేదని.. కనీసం రైతులను ఓదార్చడానికి ఎవరూ రాకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శి ంచారు. అదేవిధంగా వరిపంట నష్టపోయిన రైతులకు తక్షణమే రూ.10వేలు, అదే విధంగా ప్రతి ఎకరాకు రూ.40వేల పంట నష్టపరిహారం అందించాలని కోరారు. కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని, ప్రభుత్వం ఆదుకోకుంటే రైతులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు.
రైతులకు రైతుభరోసా రాలేదని, రుణమాఫీ, బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. మాజీ మంత్రి వెంట గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, కోటకదిర పీఏసీసీఎస్ చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, సీనియర్ నాయకులు రవీందర్‌రెడ్డి, శ్రీనివాసులు, రాఘవేందర్‌గౌడ్, రాజగోపాల్‌యాదవ్, బొక్కలోనిపల్లి మాజీ ఉప సర్పంచ్ అశోక్‌గౌడ్, రైతులు తదితరులు ఉన్నారు.
జడ్చర్ల, మార్చి 23: జడ్చర్ల మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానతో మా మిడికాయలు నేలరాయి. మామిడిరైతులు తీవ్రం గా నష్టపోయారు. వడగళ్లతో కూడిన వర్షం కురవడంతో జడ్చర్ల మండలంలోని కిష్టారంలో రైతు గోపాల్‌రెడ్డికి చెందిన 8ఎకరాల మామిడితోటలోని మామిడికాయలతోపాటు పిం దెలు పూర్తిగా నేలరాలాయి. మా మిడికాయలు రాలిపోవడంతో దాదాపు రూ.3లక్షల నష్టం కలిగినట్లు రైతు గోపాల్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా జడ్చర్ల నియోజకవర్గంలోని రాజాపూర్ మం డలం ఖానాపూర్‌లో వడగళ్ల వర్షం కురిసింది. ఆరుతడి పంటలకు మం చి పదును లభించింది.
నవాబ్‌పేట, మార్చి 23: మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. సాయం త్రం ఒక్కసారిగా వడగండ్ల వాన కురవడంతో వాతావరణం చల్లబడింది. ఈదురు గాలులకు అక్కడక్కడా మామిడి కాయలు నేలరాలాయి. కొల్లూరు, కాకర్జాల, యన్మన్గండ్ల, అమ్మాపూర్ తదితర గ్రామాల శివార్లలో ఏర్పాటు చేసిన ఇటుక బట్టీలు అకాల వర్షానికి తడిసి పోయి నష్టం వాటిల్లింది. ఈదురు గాలులకు అక్కడక్కడా చెట్లు విరిగి పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఆరెకరాల్లో వరి సాగుచేశాం. రాత్రి పడిన వడగండ్ల వానకు వరి పంట మొత్తం వడ్లు రాలిపోయాయి. వరి పంట మొత్తం గడ్డి మాత్రం మిగిలింది. పంటసాగుకు మొత్తం రూ.లక్షా 90వేలు పెట్టుబడికి అప్పు చేశాం. తెచ్చుకున్న అప్పు ఎలా కట్టాలో దిక్కుతోచట్లేదు. ఒక వైపు రైతుభరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుబంధు పడింది. ఇప్పుడు పడలేదు, ఒక దిక్కు వడగండ్ల వర్షానికి పంట నాశనమైంది. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలి.
– జయమ్మ, బొక్కలోనిపల్లి, మహబూబ్‌నగర్ మండలం
రాత్రి అకస్మికంగా కురిసిన వడగండ్ల వానకు పంట నాశనమైంది. కష్టపడి అప్పు చేసి, రాత్రి పగలు పొలం వద్ద ఉండి పారవెట్టిన పంట మొత్తం నేలపాలైంది. రాత్రి పెద్దపెద్ద వడగండ్లు పడ్డాయి. ఒకవైపు బోరులో నీరు లేక ఇబ్బందులు పడుతూ నీరు పెడుతున్న సమయంలో నోటికాడికొచ్చిన పంట నేలపాలైంది. రెండున్నర ఎకరా ల్లో పంట సాగు చేశాం. మా భర్త ఆటో డ్రైవర్. సంపాదన లేక వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతున్నాం. ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించాలి.
– పద్మ, బొక్కలోనిపల్లి, మహబూబ్‌నగర్ మండలం
ఆదివారం సాయంత్రం కురిసిన వడగళ్లతో కూడిన వర్షానికి 8ఎకరాల్లో మామిడిచెట్లకు కాయలు రాలిపోవడంతో తీవ్ర నష్టం వచ్చింది. గతంలో మామిడితోటతో ప్రతిఏటా మంచి ఆదాయం వచ్చేది. దాంతో తన కుటుంబ అవసరాలు తీరేవి. ఈ ఏడాది మామిడికాయలు కూడా అంతంతమాత్రంగా కాశాయని, ఆదివారం కురిసిన వడగండ్ల వర్షానికి చెట్టకు ఉన్న కాయలు, పిందెలు పూర్తిగా రాలిపోయాయి. అకాలవర్షానికి పంటపాడైనందునా ప్రభుత్వం ఆదుకోవాలి.
– గోపాల్‌రెడ్డి, రైతు, కిష్టారం, జడ్చర్ల మండలం