నారాయణపేట, ఆగస్టు 16 : ఓ వైపు సంక్షేమ సౌరభం.. మరో వైపు సాగు సంబురం.. తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నది. సీఎం కేసీఆర్ రైతును రాజు చేయడమే లక్ష్యంగా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. దీంతో నాడు వలసకు కేరాఫ్‌గా ఉన్న నారాయణపేట జిల్లా నేడు పంటలతో కళకళలాడుతున్నది. 2014 వానకాలం 3,72,068 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా.. 2022లో 4,30,389 ఎకరాలు.. 58,321 ఎకరాలు అదనంగా సాగయ్యాయి. 2014-15 యాసంగిలో 64,056 ఎకరాలు ఉండగా.. 2022-23 యాసంగిలో 1,58,101 ఎకరాల్లో పంటలు పండగా.. నికరంగా 92,045 ఎకరాలు అదనంగా సాగయ్యాయి. ఈ ఏడాది 4.30 లక్షల ఎకరాల్లో పంటల అంచనా ఉండగా.. ఈ సీజన్లో జిల్లాలోని 1,65,873 మంది రైతుల ఖాతాల్లో రూ.1954.13 కోట్ల రైతుబంధు జమైంది. 3,591 మంది కుటుంబాలకు రైతుబీమా అందగా.. 1,06,860 మందికి రుణమాఫీ వర్తించనున్నది. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కర్షకుల మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది.
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో లబ్ధిపొందుతున్న అన్నదాతలు ఆనందం వ్య క్తం చేస్తున్నారు. వ్యవసాయానికి ప్రతీకగా తెలంగాణ నేడు దేశానికి నిర్దేశం చేస్తోంది. తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు సంక్షేమ పథకాలను తమ వ ద్ద అమలు చేయాలని దేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద రైతులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. గతం లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతుబంధు, రై తు బీమా, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, రుణమాఫీ, చెరువుల పునరుద్ధరణ, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ, ఏఈవోల నియామకం, రైతువేదికలు, పంట కల్లాల నిర్మాణం, రైతుబంధు సమితుల ఏర్పాటు.. ఒకటా రెండా.. లెకకు మించిన అద్భుతమైన పథకాలు, సంసరణలను సీఎం కేసీఆర్ అమలులోకి తీసుకొచ్చారు. ఫలితంగా నారాయణపేట జిల్లాలోనే 4లక్షల 30వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఇందుకుగానూ ప్రభుత్వం 47వేల మెట్రి క్ టన్నుల ఎరువులు, 26వేల క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచింది. దుకి దున్నింది మొదులుకొని పండిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ అన్నదాతకు అడుగడుగనా అండగా నిలుస్తుం ది. తెలంగాణ రైతు పెట్టుబడికి ఎవరి వద్ద చేయి చాచకుండా ప్రభుత్వం ప్రతి ఏడాది ఎకరానికి రూ.పదివేలు రైతుబంధు పథకం ద్వారా అందజేస్తున్నది. దీంతో రైతు అప్పుల్లో కూరుకుపోకుండా సంతోషంగా పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తున్నాడు.
రైతుబంధు@ రూ.1,954.13కోట్లు
రైతుబంధు ద్వారా జిల్లాలో 2018 వానానలం నుంచి యాసంగి 2022 వరకు రూ.1954.13కోట్లు 1,65,873మంది ఖాతాల్లో జమ చేసింది.
1, 06,860మందికి రుణమాఫీ వర్తింపు..
నారాయణపేట జిల్లాలో 1,06,860మంది రైతులు ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం పంట రుణమాఫీ ప్రకటించడంతో ఈ రైతులందరికీ వర్తించనుంది. రుణమాఫీ పథకం కింద జిల్లాలో 2014, 2018లో రెండు విడతల్లో కలిపి 9,225 మంది రైతులకు రూ.22కోట్ల 46లక్షలను మాఫీ చేశారు. ఇటీవల మిగతా రైతులకు కూడా పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో జిల్లాలో మిగిలిన 97,635 మంది రైతులకు సంబంధించి రూ.773.91కోట్లు మాఫీ చేశారు.
జిల్లాలో పెరిగిన పంట విస్తీర్ణం..
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాకతీయల కాలంలో నిర్మించిన చెరువులకు పూడిక తీత చేపట్టింది. దీంతో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరగడం, మక్తల్ ప్రాంతంలో నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించడం వల్ల భూగర్భ జలాలు పెరగడం, వర్షాధారంగా బోర్ల మీద ఆధారపడిన వారికి సాగునీరు సమృద్ధిగా లభిస్తుంది. ఫలితంగా జిల్లాలో 2014 వానకాలంలో 3,72,068 ఎకరాల్లో పలు పంటలు సాగు చేయగా 2022 వానకాలంలో 4,30, 389 ఎకరాలకు పెరిగింది. ప్రభుత్వ కృషితో నికరం గా 58,321 ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చిం ది. యాసంగి 2014-15 సాగు విస్తీర్ణం 64,056 ఎకరాల్లో సాగు కాగా అదే యాసంగి 2022-23లో విస్తీర్ణం 1,58,101 ఎకరాలకు పెరిగింది. అదనంగా 92,045 ఎకరాలు సాగులోకి వచ్చినట్లయ్యింది. ఒకప్పటి తెలంగాణ కరెంటు కోతలు, రాత్రిపూట కరెం టు వేయబోయి చనిపోయిన రైతులు, నాణ్యమైన విద్యుత్ లేక కాలిపోయిన మోటర్లు, వాటిని బాగు చేయడానికి అయ్యే ఖర్చులతో విలవిల్లాడేది. ప్రస్తు తం 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు, మూడు పంటలు, అధిక దిగుబడులతో సుస్థిరంగా ఉన్నది. నారాయణపేట జిల్లాలో 2014 నుంచి ఇప్పటి వరకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా 10,565 మంది రైతులకు రూ.12.35కోట్ల రాయితీతో యం త్రాలు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు సరఫరా చేశారు.
3,591 కుటుంబాలకు రైతుబీమా..
తెలంగాణ రాకముందు రైతు అప్పుల బాధతో లేదా ఏదైనా కారణం చేత చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి. కానీ ఇప్పుడు రైతు ఏ కారణం చేతనయినా చనిపోతే ఆ కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షలు రైతుబీమా రూపంలో అందజేస్తున్నది. ఈ డబ్బులను బిడ్డల పెండ్లిళ్లు, చదువులు, ఇతర అవసరాలకు ఉపయోగించుకొని సమాజంలో గౌరవంగా బతుకుతున్నారు. జిల్లాలో చనిపోయిన 3,591 మంది రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ప్రభుత్వం రూ.175.75కోట్లను నామినీల ఖాతాల్లో జమ చేసింది.
పీడీ యాక్ట్ నమోదు..
నకిలీ విత్తన విక్రయదారులపై పీడీ యాక్ట్ ప్రయోగించే ఏకైక రాష్ట్రం తెలంగాణ. జిల్లాలో ఇప్పటివరకు 36 కేసులు నమోదు కాగా అందులో ఒకరిపై పీడీ యాక్ట్ నమోదైంది. అదేవిధంగా ఫర్టిలైజర్ దుకాణాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు. నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని, గుర్తింపు పొందిన ఎరువుల దుకాణాల్లో విత్తనాలను కొనుగోలు చేసి అందుకు సంబంధించిన రసీదును భద్రంగా ఉంచుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఫలితంగా నకిలీ విత్తనాల విక్రయాలు చాలా వరకు తగ్గాయి.
అందుబాటులో ఎరువులు, విత్తనాలు..
ఒకప్పుడు ఎరువులు, విత్తనాల కోసం రోజంతా వరుసలో నిలబడిన రైతులు.. నేడు ప్రభుత్వమే ప్రణాళికాబద్ధంగా వాటిని సీజన్‌కు ముందుగానే అందుబాటులో ఉంచుతున్నది. జిల్లాలో జీలుగ, ఇతర విత్తనాలు 2014 వానకాలం నుంచి 2023 వానకాలం వరకు రూ.7.93కోట్ల రాయితీతో 49,837.81 క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేసింది. వానకాలం 2023-2024కు గానూ వివిధ సంస్థల ద్వారా అందించే ఎరువులను పంపిణీ చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద యూరియా 2043.22 టన్నులు, డీఏపీ 1966.78 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 1755.95 టన్నులు, పొటాష్ ఎరువులు 101 టన్నులు అందుబాటులో ఉన్నాయి. మార్ఫెడ్లో యూరియా 4606.74 టన్నులు, డీఏపీ 398 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 330.35 టన్నులు బఫర్ స్టాక్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా సమయంలో కూడా రైతులు పండించే ధాన్యాన్ని కొనుగోలు చేసి వారి ఖాతాల్లో రెండుమూడు రోజుల్లో నగదు జమ చేసింది. రోజుల తరబడి మార్కెట్లో వేచి ఉండకుండా రైతులకు ఉపశమనాన్ని కలిగించింది.
రైతుబీమాతో ఇంటి స్థలం కొన్నా..
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం మాకు వరంలాంటింది. రైతుకు పొలం ఉంటే చాలు వారి కుటుంబానికి రైతుబంధు వర్తిస్తుంది. ఆ రైతు మరణిస్తే వారి కుటుంబానికి రూ.5లక్షలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఆపదలో ఉన్న మా కుటుంబాన్ని రైతుబీమా డబ్బులే ఆదుకున్నయి. నా భర్త మరణిస్తే వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకునేందుకు స్థలం కొన్నాను.
– చెన్నమ్మ, రైతు, ఎంనోనిపల్లి, ధన్వాడ
రైతుబంధుతోనే సాగు చేస్తున్నా..
గతంలో నేను పంట సాగుకు గ్రామంలో అప్పు తెచ్చే వాడిని. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత కరెంటుతోపాటు రైతుబంధు ఇస్త్తుండడంతో ఎవరి దగ్గర చేయి చాపడం లేదు. ప్రభుత్వం ఇస్తున్న పైసలతోనే సాగు చేసుకుంటున్నా. రైతుల సంక్షేమం కోరే ఈ ప్రభుత్వానికి మేమంతా రుణపడి ఉంటాం. సమయానికి విత్తనాలు, ఎరువులు అందుతున్నాయి. రైతుల కోసం పరితపించే కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపిస్తాం.
– ఆంజనేయులు, రైతు, రాకొండ, మరికల్