అమరచింత : ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ( Indiramma Houses ) ఎంపికలో అనర్హులను గుర్తిస్తే ఆందోళన తప్పదని సీపీఎం (CPM ) మండల కార్యదర్శి జిఎస్ గోపి, పట్టణ కార్యదర్శి బి వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు అజయ్, ఎస్ రాజు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లను అందజేసేందుకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తున్న ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులైన వారిని గుర్తించాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం సీపీఎం కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి లబ్ధిదారుల ఎంపికకు చేయాలని నిబంధనలు ఉండగా అమరచింత మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డుల్లో మున్సిపల్ అధికారులు ఇప్పటివరకు ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. ఏ ఒక్కచోట కూడా సమావేశాలు నిర్వహించకుండా కేవలం అధికార పార్టీ నేతలు సూచించిన పేర్లను ఎంపిక చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనేక ఏళ్లుగా పేదలకు ప్రభుత్వం ఇండ్లను గాని, ఇళ్ల స్థలాలను గాని ఇవ్వకపోవడం చేత ఇండ్లు లేని పేదల సంఖ్య గ్రామ గ్రామాన పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్ జిల్లాకు ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం చెప్పినట్టుగా 2,500 ఇండ్లు కాకుండా వాటిని రెండింతలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లను అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.