నాగర్‌కర్నూల్ : రాష్ట్ర రైతాంగం కరెంట్ కోతలతో సతమతమౌతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ( Harish Rao) ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) సొంత గ్రామం కొండారెడ్డిపల్లి సమీపంలోనే రైతులు కరెంట్ కోసం రోడ్డెక్కడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ( Congress Failures ) నిలువెత్తు నిదర్శనమని అన్నారు.
గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సమీపంలోని శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు మెరుపు ధర్నాకు దిగడం, ట్రాక్టర్లతో రాస్తారోకో చేయడం ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతూ రేవంత్ రెడ్డికి కౌంట్‌డౌన్ ( Countdown ) మొదలైందన్నారు. పంటలు ఎండిపోతుంటే రైతులు రోడ్డెక్కారు.. కానీ ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టింపు లేకపోవడం దుర్మార్గమని అన్నారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు 24 గంటల కరెంట్ హామీ ఇచ్చి, ఇప్పుడు రైతులకు 6–8 గంటల విద్యుత్ కూడా సరఫరా చేయకపోవడం శోచనీయమని అన్నారు. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, వారి గోడును పట్టించుకోకుండా చోద్యం చూడడం విడ్డూరమని తెలిపారు. ముఖ్యమంత్రి సొంత గ్రామానికి కూతవేటు దూరంలోనే రైతులు కరెంట్ కోసం జాతీయ రహదారిపైకి రావాల్సి పరిస్థితిని వస్తే దాన్ని ‘ప్రజా పాలన’ అంటారా? అని నిలదీశారు.
సొంత ఇలాకాలోని రైతుల సమస్యలే పరిష్కరించలేని సీఎం , తెలంగాణలోని లక్షలాది మంది రైతుల సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? ఇదేనా కాంగ్రెస్ తెచ్చిన ‘మార్పు’ . రైతుల ఆక్రందన రేవంత్ రెడ్డికి వినిపించడం లేదా ? ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మొద్దునిద్ర వీడి రైతుల పొలాలకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.