
జడ్చర్ల, డిసెంబర్ 30 : పత్తికి మార్కెట్లో రికార్డు స్థాయి ధరలు పలుకుతుండడంతో రైతుల పంట పండుతున్నది. అన్నదాతల ఇంట కాసులవర్షం కురిపిస్తున్నది. క్వింటాకు దాదాపుగా రూ.9 వేలు వస్తుండడంతో రైతుల్లో ఆనందం నెలకొన్నది. పత్తి నాణ్యతగా ఉండడంతో వ్యాపారులు అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ సీజన్లో ధరలు ఇంకా పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు, వ్యాపారులు తెలుపుతున్నారు. ఈ ఏడాది వానకాలం సీజన్ ప్రారంభంలో అధిక వర్షాలతో మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యాన, ఒడిస్సా తదితర రాష్ర్టాల్లో పత్తి దిగుబడులు తగ్గాయి. దీంతో మన రాష్ట్రంలో పండిన తెల్ల బంగారానికి డిమాండ్ పెరిగింది. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో క్వింటా పత్తికి రూ.8 వేల నుంచి రూ.8,829 ధర పలుకుతున్నది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రూ.9 వేల మార్కు దాటినట్లు తెలుస్తున్నది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పొడువు రకం పింజ పత్తికి రూ.6,025, మధ్యరకానికి రూ.5,726 మద్దతు ధర ప్రకటించింది. అయితే బాదేపల్లి మార్కెట్లో మద్దతు ధరలను మించి కొనుగోలు చేస్తున్నారు. కనిష్ఠ ధరలే రూ.7వేలపైన ఉన్నాయి. అధిక ధరలు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడు, నాలుగు ఏండ్లుగా క్వింటా పత్తికి గరిష్ఠంగా రూ.6వేల పైచిలుకు ధర రాగా.. ఈ ఏడాది ఏకంగా రూ.8,829 ధర పలికింది. అంటే దాదాపు రూ.3 వేలు అధికంగా ఉన్నది. బాదేపల్లి వ్యవసాయ పత్తి మార్కెట్లో 2018-19లో క్వింటా పత్తికి గరిష్ఠంగా రూ.6,069.. 2019-20లో రూ.6,129 రాగా.., 2020-21లో రూ.6,140 పలుకగా.. ప్రస్తుతం రూ.8,829 ఉన్నది.
పత్తికి డిమాండ్ పెరిగింది..
ఈ ఏడాది వర్షాలకు ఇతర రాష్ర్టాల్లో పంట దెబ్బతినడంతో పత్తి దిగుబడులు తగ్గాయి. దీంతో డిమాండ్ పెరిగింది. రాష్ట్రంలోని పత్తికి ఎప్పుడూ ఎక్కువ ధర పలుకుతుంది. చేనులో పత్తి ఏరడం చివరి దశకు చేరడంతో మార్కెట్‌కు పత్తిరాక తక్కువైంది. దీంతో వ్యాపారుల మధ్య పోటీ ఏర్పడి మంచి ధరలు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్‌ను బట్టి ధరలు పెరగడం, తగ్గడం జరుగుతుంది.
ఇంత ధరలు ఎన్నడూ చూడలేదు..
పత్తికి ఇంత పెద్దమొత్తంలో ధరలు రావడం ఎన్నడూ చూడలేదు. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం ఏడు క్వింటాళ్ల పత్తి తెచ్చాను. క్వింటాకు రూ.8,589 పలికింది. పత్తికి ఇంతధరలు రావడం ఆనందంగా ఉన్నది. వర్షాలులేక దిగుబడి తక్కువ వచ్చింది కానీ ధర ఎక్కువ వచ్చింది.