మక్తల్ : సమాజ శ్రేయస్కారం కోసమే మక్తల్ మున్సిపాలిటీలో కార్డన్ సెర్చ్ (Cordon search) చేపట్టామని నారాయణపేట డీఎస్పీ లింగయ్య (DSP Lingaiah) అన్నారు. పట్టణంలో అనుమానిత వ్యక్తులు, అనుమానిత వాహనాలను స్వాధీనం చేసుకోవాలని లక్ష్యంతో సీఐ రాంలాల్ ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున మక్తల్ మున్సిపాలిటీలో కార్డన్ సెర్చ్ నిర్వహించి ప్రతి ఇంటిని తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ లింగయ్య మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని బురాన్ గడ్డ, రెడ్డి నగర్, ఆజాద్ నగర్ కాలనీలలో కార్డన్ సెర్చ్ను చేపట్టగా సరైన ధ్రువపత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలను ( Two Whealers ) స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నారాయణపేట జిల్లాకు కర్ణాటక ( Karnataka ) రాష్ట్రం అతి దగ్గరలో ఉన్నందువల్ల, కర్ణాటకకు చెందిన ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసి తెలంగాణలో వాహనాన్ని రిజిస్ట్రేషన్ మార్పిడి చేసుకోకపోవడంతో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు.
తమ తనిఖీల్లో పట్టణంలో అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని సైతం బహిర్గతం అవుతుందని తెలిపారు. ద్విచక్ర వాహనాలు కలిగిన ప్రతి వ్యక్తులు వాహనాలకు నెంబర్ ప్లేట్లు, లైసెన్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనం పైన ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మక్తల్ సీఐ రాంలాల్, ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డితో పాటు ఆరుగురు ఎస్సైలు, 70 మంది సిబ్బంది పాల్గొన్నారు.