నాగర్కర్నూల్, మే 21 : ఏడు నెలలుగా వేతనాలు అందగా పస్తులు ఉంటున్నామని, తమ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని కలెక్టరేట్లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వీరికి మద్దతు తెలిపిన సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ ఏడు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నారని, అధికారులకు విన్నవిస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడ లేదని వారు ఆరోపించారు.
వేతనాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల వారి కుటుంబాల పోషణ ఇబ్బందిగా మారిందని, అధికారులు కలుగజేసుకొని వేతనాలు ప్రతి నెలా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లాగా రూపాంతరం చెంది కలెక్టర్ కార్యాలయం ఏర్పడిన నాటి నుంచి సకాలంలో వేతనాలు చెల్లించక కాంట్రాక్టు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టిపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
తక్కువ వేతనంతో పనిచేస్తూ కలెక్టర్ కార్యాలయాన్ని సుందరంగా ఉంచుతున్న కార్మికులకు వేతనాలు ఇవ్వడంలో మాత్రం అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్మికులతో పని చేయించుకొని వారికి సకాలంలో వేతనాలు ఇవ్వకపోతే వారి కుటుంబాలు ఎలా జీవనం సాగిస్తాయని ప్రశ్నించారు.
ఐదు గంటలు పనిచేయించుకుంటూ కేవలం రూ.240 చెల్లిస్తూ కార్మికులతో వెట్టి చేయిస్తున్నారన్నారు. కనీస వేతన చట్టాలకు సంబంధించి జీవోలు అధికారులకు తెలిసినా కాంట్రాక్టర్కు అనుకూలంగా నిర్ణయాలు మార్పు చేసుకొని కార్మికుల పొట్టుకొడుతున్నారన్నారు. ఇప్పటికైనా పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, లేదంటే రేపటి నుంచి నిరవధిక సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో శానిటేషన్ కార్మికులు రిజ్వాన్, నాగమణి, ఎల్ల మ్మ, శ్రీదేవి, అలివేల, రేణుక తదితరులు పాల్గొన్నారు.