Palamuru | మహబూబ్ నగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 21: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అన్ని అర్హతలు ఉన్న యూనివర్సిటీ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని ఒప్పంద అధ్యాపకుల సంఘం నాయకులు డా. జ్ఞానేశ్వర్ డిమాండ్ చేశారు. మూడో రోజు సమ్మెలో భాగంగా సోమవారం నాడు విధులు బహిష్కరించి పాలమూరు యూనివర్సిటీ ఎదుట ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. అధ్యాపకుల అరెస్టులతో ఉద్యమాన్ని ఆపగలరా.? అని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులను అరెస్టు చేయడాన్ని ముక్తకంఠంతో నిరసించారు. నోటికి నల్ల బట్టలు ధరించి అధ్యాపకులు నిరసన తెలిపారు. న్యాయమైన డిమాండ్ల సాధనలో భాగంగా శాంతియుత నిరసనలు, ఆందోళనలకు అడ్డుపడితే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జీవో 21 వెంటనే రద్దు చేయాలన్నారు. నెట్, సెట్, పీహెచ్డీ అర్హత ఉన్న ఒప్పంద అధ్యాపకులందరినీ భేషరతుగా క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. లేదంటే యూజీపీ పే స్కేల్‌తో కూడిన ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.