అయిజ, జూలై 26 : కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతున్నది. బుధవారం డ్యాంకు ఇన్‌ఫ్లో 1,38,473 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 75వేల క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1705 అడుగులకు గానూ ప్రస్తుతం 1695.67 అడుగులకు చేరింది. 129.72 టీఎంసీల సామర్థ్యానికి ప్రస్తుతం 85.55 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 56,800 క్యూసెక్కులు ఉండగా మూడుగేట్లను మీటర్ మేర ఎత్తి 14,460 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పూర్తిస్థాయి సామర్థ్యం 37.640 టీఎంసీలకు గానూ 19.92 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
కర్ణాటకలోని తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ డ్యాంకు లక్షా 12,171 క్యూసెక్కుల వరద చేరుతోంది. బుధవారం డ్యాంలోకి ఇన్‌ఫ్లో 1,12,171 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 92 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యాం గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 44.190 టీఎంసీలు ఉన్నాయి. 1,633 అడుగులకు గానూ ప్రస్తుతం 1,613.16 అడుగులకు చేరినట్లు డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.
ధరూర్/అమరచింత, జూలై 26 : జూరాల ప్రాజెక్ట్‌కు మళ్లీ వరద ప్రారంభమైంది. బుధవారం సాయంత్రాని కి ఇన్‌ఫ్లో 30వేల క్యూసెక్కులకు చేరింది. దీంతో పవర్‌హౌస్‌కు 29,641క్యూసెక్కులు వినియోగిస్తుండగా.. నె ట్టెంపాడ్ లిఫ్ట్‌కు 1,500, భీమా లిఫ్ట్-1కు 650, భీమా లిఫ్ట్-2కు 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నా రు. ఎడమ కాల్వ ద్వారా 640 క్యూసెక్కుల నీటిని ది గువకు విడుదల చేశారు. అవుట్ ఫ్లో 32,510 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్ట్ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా 5.343 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
నెట్టెంపాడ్ ఎత్తిపోతల రిజర్వాయర్లకు నీటి తరలింపు కొనసాగుతున్నట్లు ఈఈ రహీముద్దీన్ బుధవారం తెలిపారు. జూరాల నుంచి నెట్టెంపాడ్ ఎత్తిపోతల రిజర్వాయర్లకు 1,500 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. ర్యాలంపాడు రిజర్వాయర్ నీటిమట్టం 2 టీంఎంసీలు కాగా ప్రస్తుతం 0.5 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ 1 టీఎంసీ కాగా ప్రస్తుతం 0.4 టీఎంసీల నిల్వ ఉన్నది. ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి ముచ్చోనిపల్లి, నాగర్‌దొడ్డి, తాటికుంట రిజర్వాయర్లకు పంపింగ్ కొనసాగుతున్నది.
ఆత్మకూరు, జూలై 26: ఎగువ, దిగువ జూరాల జెన్కో జలవిద్యుత్ కేంద్రా ల్లో జలవిద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. ఎగువ జూరాలలో 4 యూనిట్లు, దిగువ జూరాలలో 2 యూనిట్లలో విద్యుదుత్పత్తి జరుగుతున్నది. మంగళవారం మొత్తంగా 196 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరుగగా ఈ సీజన్లో ఇప్పటి వరకు 4.669 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. దిగువ జూరాలలో 2 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తుండగా 0.157 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. మొత్తంగా 5.681 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగిందని ఎస్ఈ తెలిపారు.
శ్రీశైలం, జూలై 26 : శ్రీశైల జలాశయానికి వరద నిలకడగా కొనసాగుతున్నది. బుధవారం ఉదయం నుంచి జూరాల పవర్‌హౌస్ నుంచి విడుదలైన నీరు సాయంత్రానికి శ్రీశైలానికి చేరుకున్నది. జూరాల నుంచి ఇప్పటి వరకు 7,986 క్యూసెక్కులు విడుదల కాగా, హంద్రీ నుంచి 117 క్యూసెక్కులు రాగా శ్రీశైల జలాశయానికి 701 క్యూసెక్కుల నీరు చేరింది. డ్యాం పూర్తిస్థాయి సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుతం 815 అడుగులకు చేరింది. 215 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 37.60 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. విద్యుదుత్పత్తికి సిద్ధమవుతున్న 4వ యూనిట్ టీఎస్ జలవిద్యుత్ కేంద్రంలో మెకానికల్ స్పింజన్, ఎలక్ట్రికల్ స్పింజన్ ట్రయిల్ రన్ పూర్తి చేసుకుని విద్యుదుత్పత్తికి 4వ యూనిట్ సిద్ధమైంది. 2020 ఆగస్టు 21న పేలుడుకు గురై పూర్తిగా ధ్వంసమైన యూనిట్‌కు అధికారులు మరమ్మతులు చేపట్టి ట్రయిల్ రన్ నిర్వహించారు. ఈనెల 28 నాటికి 4వ యూనిట్‌తో విద్యుదుత్పత్తి చేపట్టనున్నట్లు సమాచారం.
మదనాపురం, జూలై 26 : ఎగువ నుంచి రామన్‌పాడు జలాశయంలోకి వరద చేరుతున్నది. దీంతో బుధవారం సాయంత్రం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా జేఈ మాట్లాడుతూ ఎగువ నుంచి 2వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో ఎడమ కాల్వ ద్వారా 900క్యూసెక్కులు, భీమా ఫేజ్- 2 పంపునకు 750, ఆయకట్టుకు 30 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు. జలాశయంలో ప్రస్తుతం 1,021.6 అడుగుల నీరు నిల్వ ఉన్నదని తెలిపారు.