
అచ్చంపేట, డిసెంబర్ 21: అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డు స్థలంలో నూతనంగా మరికొన్ని దుకాణా సముదాయాలు నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సీఎంరెడ్డి అన్నారు. మంగళవారం కార్యాలయంలో మాట్లాడుతూ మార్కెట్ యార్డులోని ప్రధాన గేటు పక్కన కుడిపక్కన వెయ్యి మెట్రిక్ టన్నుల గోదాంను ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో కమర్షియల్ షాపుల సముదాయం నిర్మించేందుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. దుకాణాల సముదాయం నిర్మించడం అవసరంగా భావించి ఇటీవల నిర్వహించిన మార్కెట్ పాలకవర్గం సాధారణ సమావేశంలో తీర్మానం చేసినట్లు తెలిపారు. మార్కెట్ యార్డులో 26మంది కమీషన్ ఏజెంట్లు, 32మంది ఖరీదుదారులకుగానూ 26 దుకాణాలు మాత్రమే ఉన్నాయని మిగిలిన వారికి వేరుశనగ సీజన్లో మార్కెట్‌యార్డులో క్రయవిక్రయాలు నిర్వహించేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సాధారణ సమావేశంలో చర్చించి ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని అన్నారు. పది వ్యాపార దుకాణాల నిర్మాణానికి రూ.62లక్షలు, మార్కెట్ యార్డులో లోపలిభాగంలో 3దుకాణాలకు రూ.60లక్షలు, షెడ్డు నిర్మాణానికి రూ.46లక్షలతో ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సహకారంతో మార్కెట్ యార్డులో రైతులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ధాన్యం విక్రయించేందుకు మార్కెట్‌కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొత్తం రూ.కోటి28 లక్షలతో ప్రతిపాదనలు పంపించామని, త్వరితగతిన మంజూరు చేయించుకొని దుకాణాలు నిర్మించేవిధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.