దేవరకద్ర రూరల్ (చిన్న చింతకుంట), డిసెంబర్ 1 : కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ర్టాన్ని పదేండ్లు సస్యశ్యామలంగా కేసీఆర్ మార్చి శ్రీరామరక్షగా ఉన్నారని, ఏడాది పాలనలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నదని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం చిన్నచింతకుంట మండలం ఉం ద్యాలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సింగిల్ విండో డైరెక్టర్ మాసన్న, కప్పెరి వెంకటయ్యతోపాటు పలువురు నేతలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వీరికి ఆల గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, ఆరు గ్యారెంటీలంటూ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. కేసీఆర్ రైతులకు అండగా నిలిచి రైతుబంధు ద్వారా పంటసాయం అందించగా, కాంగ్రెస్ సర్కారు మాత్రం రైతుల నోట్లో మట్టి కొడుతూ పథకాన్ని ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నదన్నారు.
ఏడాదిలోనే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంతో విసిగిపోయారని, మళ్లీ కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. అన్నివర్గాల వారిని రేవంత్‌రెడ్డి అబద్ధపు హామీలతో నిండా ముంచారన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయడం చేతగాక వ్యక్తిగత విమర్శలతో కాలయాపన చేస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాము, నేతలు పాల్గొన్నారు.