వనపర్తి, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ వద్దని రైతులు వంద రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రైతుల మనోభావాలు తెలుసుకొని వారికి భరోసా కల్పించి దీక్షలను విరమింపజేయాలన్న లక్ష్యంతోనే మాజీ మంత్రి హరీశ్‌రావు పర్యటన ఖరారైందని నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం వనపర్తి పట్టణంలో సింగిరెడ్డి నివాసంలో సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరీశ్‌రావు వస్తున్నాడంటేనే ప్రభుత్వ గుండెల్లో గుబులు పుట్టిందని, రైతులకు సంఘీభావం చెప్పడమే ప్రధాన ఉద్దేశమని, అదే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కూడా ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా తీసుకుందన్నారు. నిబంధనల ప్రకారం ఈనెల 3వ తేదీన స్థానిక పోలీసుల నుంచి గొల్లపల్లి తదితర గ్రామాల రైతులతో సభ ఏర్పాటుకు అనుమతి తీసుకున్నట్లు గుర్తుచేశారు. అన్ని కార్యక్రమాలు సిద్ధం చేసుకున్న తర్వాత మళ్లీ ఇన్చార్జి ఎస్పీ పేరుతో ఎలాంటి కారణం లేకుండానే సభ అనుమతులను రద్దు చేస్తున్నట్లు బుధవారం చెప్పడం శోఛనీయమన్నారు. దీనిపై హైకోర్టుకు వెళ్లామని, ఎలాంటి షరతులు లేకుండా సభ నిర్వహణకు అనుమతినివ్వడంతో ఖంగుతిన్నారన్నారు.
వంద రోజులుగా దీక్షలు చేస్తుంటే లేని లా అండ్ ఆర్డర్ సమస్య సభకు అనుమతిస్తే సమస్య వస్తుందనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సభ పెడుతామంటే అధికార పక్షానికి ఎందుకు అంత భయమని ఆయన ప్రశ్నించారు. సభలు, సమావేశాలను పోలీసులతో ఆటంక పరిచి పైశాచిక ఆనందం పొందడం ద్వారా ప్రయోజనం ఏమి ఉండదన్నారు. రైతుల అభిప్రాయాలను ప్రభుత్వం స్వీకరించాలని, ప్రజలు చెప్పే విషయాలను తాము వినేది లేదంటే నడవదని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. అధికారం చేపట్టక ముందు చెప్పిన వాగ్ధానాలు అమలు పరచకుండా ప్రజలను గందరగోళ పరుస్తున్నారని, పిల్లి శాపనార్థానాలు పెట్టినట్లుగా ఎలాంటి జ్ఞానం లేకుండా మాట్లాడే వారికి సమయం వచ్చినప్పుడు వంద రెట్ల స్థాయిలో సమాధానాలుంటాయని సింగిరెడ్డి హెచ్చరించారు.
గతంలో ప్రజాస్వామ్యం లేదని మాట్లాడిన రేవంత్ రెడ్డి నేడు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులను కల్పిస్తున్నాడో అర్థమవుతుందని, రాజ్యంగ హక్కుల ప్రకారం అనుమతులు తీసుకోవడం సర్వసాధారణ ప్రక్రియగా పేర్కొన్నారు. ప్రజస్వామ్య వ్యవస్థలో పోలీసులు తమ పరిధులను అతిక్రమిస్తున్నారని, గజ్వేల్‌లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడులు జరిపేందుకు అధికారపార్టీయే పురమాయించడం వల్ల రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా అమలవుతుందో తెలిసిపోతుందన్నారు. వందరోజులపాటు సహనంతో దీక్షలు చేసిన రైతులకు అభినందనలని, మీ అభిప్రాయాలకు అనుగుణంగా ఉండి కలిసి పోరాడుతామని ఆయ న భరోసా ఇచ్చారు. 80శాతం ప్రజలు ఒప్పుకుంటేనే ఏప్రాజెక్టు అయినా నిర్మాణం జరగాల్సి ఉంటుందని, అలా లేనప్పుడు సాధ్యం కాదన్నారు.
ప్రస్తుతం భూసేకరణ అన్నది ఓ సవాల్‌గా మారిందని, అలాంటప్పుడు 1352 ఎకరాలు సేకరణ చేయడం అంతా ఆషామాషీ విషయం కాదన్నారు. 7టీఎంసీలతో గొల్లపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన గతంలో చేసినప్పటికీ ఏదుల రిజర్వాయర్, అలాగే డీ-8, డీ-5 కాల్వల రాకతో ఆ ప్రతిపాదనను బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆరేళ్ల కిందట నిలిపివేసిందని నిరంజన్‌రెడ్డి గుర్తుచేశారు. కేఎల్ఐ ప్రాజెక్టులో రిజర్వాయర్ల సామర్థ్యం తక్కువగా ఉన్నందునా అప్పట్లో కొన్ని రిజర్వాయర్ల ప్రతిపాదన వచ్చిందని గుర్తుచేశారు. ప్రజలకు సాగునీటి అవసరాలను గుర్తించడంలో కేసీఆర్, బీఆర్ఎస్ చేసినంతా గతంలో ఎవరూ చేయలేదని, మున్ముందు కూడా ఎవరూ చేయలేరని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతుల మనోభావాలను అర్థం చేసుకునేందుకు గురువారం సాయంత్రం 4గంటలకు సభను నిర్వహిస్తున్నామని, మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఉమ్మడి జిల్లాలోని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొంటారని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్,అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, నాయకులు జగదీశ్వర్ రెడ్డి, నందిమళ్ల అశోక్, రఘుపతి రెడ్డి, దొడ్ల రాములు, నాగన్న యాదవ్, హేమంత్, రాము, గిరి, జమీల్, హుస్సేన్, వెంకట్, మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.