మహబూబ్‌నగర్, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు నేడు జిల్లాలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లను సందర్శించనున్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ముందుగా జూరాల ప్రాజెక్టుకు చేరుకొని అక్కడి నుంచి కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన ఏదుల, నార్లాపూర్, వట్టెం, కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్లను సందర్శించునున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడమే కాకుండా.. ఆంధ్రాబాబులకు వత్తాసు పలుకుతూ కృష్ణా జలాల్ని తాకట్టు పెట్టడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
త్వరలో ఉమ్మడి జిల్లా పర్యటనకు వస్తున్న మాజీ సీఎం కేసీఆర్ రాకకు ముందే బీఆర్ఎస్ నేతలు చేపట్టిన ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకోనుంది.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం సొంత జిల్లాలో పట్టించుకోకపోవడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. కేసీఆర్ ప్రభు త్వ హయాంలో పాలమూరు వలసలను రూపుమాపి సస్యశ్యామలమైన జిల్లాగా మారిస్తే నేటి సీఎం రేవంత్‌రెడ్డి తన గురువు అయిన ఏపీ సీఎం చంద్రబాబుకు కృష్ణా, తుంగభద్ర నదీ జలాలను తాకట్టు పెట్టడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజల్లోకి ము ఖ్యంగా రైతాంగంలోకి తీసుకువెళ్లి చైతన్యం చేయనున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు జిల్లా ప్రాజెక్టులను సందర్శిస్తుండడంతో కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని దాదాపు 80 శాతం పూర్తి చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి డెడ్ స్టోరేజీ లో కూడా నీరు అందే విధంగా దీన్ని డిజైన్ చేశారు. అం తటితో ఆగకుండా భూగర్భంలోనే భారీ పంప్‌హౌస్‌లో సర్జ్‌ఫూల్ ఏర్పాటు చేసి వచ్చిన నీటిని వచ్చినట్లే ఎత్తిపోసే విధంగా భారీ రిజర్వాయర్ల నిర్మాణం కూడా జరిగింది. 2023 అక్టోబర్‌లో కేసీఆర్ మొదటి దశ పనులను కూడా ప్రారంభించారు. కృష్ణానది జలాలు సర్జ్‌పూల్ నుంచి పంప్‌హౌస్‌కు మళ్లీ అక్కడి నుంచి భారీపంపుల ద్వారా పైకి ఉబికి వస్తున్న కృష్ణమ్మను చూసి ఉమ్మడి జిల్లా రైతాంగం మురిసిపోయింది. ఇక తమ పొలాలు పచ్చబడితాయి.. మూడు పంటలు పండించుకుంటామని ఆశించిన రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వ రూపంలో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడ్డాక కాళేశ్వరం ఒక అద్భుతమైతే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మరో ఇంజినీరింగ్ మహా అద్భుతంగా మా రింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ప్రధానంగా అన్ని పంప్‌హౌస్‌లను కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కేవలం కాల్వల పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కాల్వలకు కూడా టెండర్లు ఆహ్వానించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారి.. ఈ జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో పాలమూరు-రంగారెడ్డిపై జిల్లా రైతులకు ఆశలు చిగురించాయి. కానీ రైతాంగం ఆశలను వమ్ము చేస్తూ ఈ జిల్లాకు చెందిన వ్యక్తి సీఎంగా ఉండి కృష్ణాజల్లాలో పాలమూరు వాటాలను ఆంధ్రాకు తా కట్టు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పనులు ప్రారంభించకపోగా నిధులు కేటాయించకుండా ఏకం గా ఈ ప్రాజెక్టుకు కేటాయించిన 90 టీఎంసీల నీటిని కాదని 45 టీఎంసీల నీళ్లే చాలని డీపీఆర్ మార్చి పంపడం కేంద్రానికి లేఖ రాయడంపై ఉమ్మడి జిల్లా రైతాంగం భగ్గు మంటుంది. అంతేకాకుండా కృష్ణానది జల్లాల్లో పాలమూరు నుంచి మేజర్ వాటర్ తీసుకుంటే ఆంధ్రా ప్రాజెక్టులకు నీళ్లు తరలించడం కష్టమవుతుందని భావించిన రాష్ట్ర సర్కార్ తన గురువుతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా సొంత జిల్లాకు అన్యాయం చేసే విధంగా రేవంత్‌రెడ్డి నిర్ణయాలు ఉన్నాయని బీఆర్ఎస్ మండిపడుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు పొగపెట్టే సామర్థ్యం ఉన్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒక టీఎంసీ నీళ్లను తీసుకోలేకపోయిం ది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో రేవంత్ సర్కార్ మిలాకత్ కావడంతోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కృష్ణానది నీళ్లను ఎత్తిపోసుకునేందుకు అవకాశం ఉన్నా ఉపయోగించుకోకుండా కృష్ణానది జలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి తాకట్టు పెట్టినట్లు స్పష్టం అవుతున్నది. దీంతో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు దాదాపు 200 టీఎంసీలకు పైగా కొల్లగొడితే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఒక టీఎంసీ నీళ్లను కూడా తీసుకులేకపోయింది. జూన్ మొదటి వారం నుంచి ఏకదాటిగా ఎంజీకేఎల్ఐ ప్రా జెక్టు మోటర్లను నడిపించిన కృష్ణానది నీళ్లను ఇప్పటి వరకు ఎత్తిపోసింది కేవలం 18 టీఎంసీలను మాత్ర మే అంటే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులో భాగంగా ఉన్న పిల్ల కాల్వలో పోతున్న నీళ్ల అంతా కూడా ఎంజీకేఎల్ఐ డ్రా చేసుకోలేకపోయింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం పీఆర్ఎల్ఐ ప్రాజెక్టును ప్రారంభించిన రెండ్రోజుల్లో రెండు టీఎంసీలను ఎత్తిపోస్తే కాంగ్రెస్ రెండు సీజన్లలో కృష్ణానది నీళ్లను ఎందుకు ఎత్తిపోయేలేదని సాగునీటి నిపుణుల నుంచి ప్రశ్నలు తలెత్తున్నాయి. అసెంబ్లీలో రాయలసీమ ప్రాజెక్టు ఆపిన చరిత్ర తనదని గొప్పగా స్వీయ భజనలు చేసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు ప్రాజెక్టును ఎందుకు నిర్లక్ష్యం చేశారో చెప్పాలని రైతుల నుంచి డిమాండ్స్ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెప్పుకోసం పాలమూరు-రంగారెడ్డి ప్రా జెక్టును పడావు పెట్టారన్నది జగమెరిగిన సత్యం.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం కా వాలని నీటి విడుదల చేయకుండా ఆపడమే కాకుండా ఏపీతో లాలూచీపడి కృష్ణా జలాలను తాకట్టుపెడుతోంది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధికారం చేపట్టాక ఇక్కడ కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డి ఇద్దరు గురు శిష్యులు పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టగా వాటిని రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చినం.. ఆ తర్వా త బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు రావలసిన నీటి వాటా దక్కించుకునేందుకు ఏకంగా కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రూపకల్పన చేశారు.
దాదాపు రూ.28 వేల కోట్లు ఖర్చుపెట్టి 80 శాతం పనులు పూర్తిచేసి పెడితే రెండేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నయా పైసా కేటాయించకపోగా ప్రాజెక్టుకు కాల్వల టెండర్లను సైతం రద్దు చేసింది. ఈ జిల్లా నుంచి సీఎంగా ఎన్నికైన వ్యక్తి ఉమ్మడి జిల్లాకు న్యాయం చేసేది పోయి జిల్లా రైతు ల ఉసురు పోసుకుంటున్నారు. మళ్లీ పాలమూరు జిల్లాను కరువు కోరల్లో నెట్టేందుకు వలసల జిల్లాగా మార్చేందుకు ప్రయత్నం జరుగుతుంది. అందుకే రేవంత్ కుట్రలను బహిర్గతం చేస్తాం. పాలమూరు-రంగారెడ్డితో పాటు ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై కాం గ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని జిల్లా రైతాంగానికి వివరించి వారి కుట్రలను తిప్పికొడతాం.
-మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్