మహబూబ్ నగర్ : అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టిన బీఆర్ఎస్ అభ్యర్థులు తెగించి కోట్లాడుతున్నారని, మూడో విడతలలో బీఆర్ఎస్ ( BRS ) బలపరిచిన అభ్యర్థులు గెలుపు ఖాయమని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ( Ala Venkateswar Reddy ) అన్నారు. బుధవారం జిల్లా భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్ల కాలంలో గ్రామాలు అభివృద్ధి చెందలేదని పేర్కొన్నారు. రెండేళ్లుగా ప్రజలు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యేల సొంత గ్రామంలో కాంగ్రెస్ ఓటమి పాలవుతుండడంతో కాంగ్రెస్ సర్పంచును గెలిపిస్తేనే నిధులు మంజూరు చేస్తామని అనేక చోట్ల ఎమ్మెల్యేలు ఓటమితో ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
ఎమ్మెల్యే నియోజకవర్గంలో అందరికీ ప్రజా ప్రతినిధిగా ఉంటారని, అభివృద్ధి, సంక్షేమంలో ప్రజలను సమానంగా చూడాలన్నారు. సీఎం జిల్లా నుంచి ఉన్నప్పటికీ ఆశించినంత అభివృద్ధి జరగడం లేదని ఆరోపించారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని వెల్లడించారు.