మిడ్జిల్ : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం రాణిపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఇతర పార్టీల నాయకుల పార్టీలోకి రావడం సంతోషకరమని అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో ఉందని అన్నారు.
అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేరాఫ్ టీఆర్ఎస్ అని, రైతులకు అండగా ఉన్న ప్రభుత్వం మాది అని తెలిపారు. గతంలో పాలించిన కాంగ్రెస్ తెలంగాణను ఎడారిగా మార్చిందన్నారు.
నేడు కాలువల ద్వారా సాగు నీరు అందిస్తూ తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నామని తెలిపారు.
పల్లె ప్రగతితో గ్రామాలన్నీ పరిశుభ్రతకు నిలయంగా మారాయని ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి తెలిపారు. తెలంగాణలో అభివృద్ధి శరవేగంగా కొనసాగుతుందన్నారు. టీఆర్ఎస్ లో చేరిన వారిలో వెంకోబ, వార్డ్ మెంబర్ అంజయ్యజీ, హనుమాన్ జీ ఇతర నాయకులు ఉన్నారు.