వంగూరు, మే 30 : రైతుల మేలు కోసం, మండల అభివృద్ధి కోసం ఎన్ని కేసులైనా భరిస్తామని బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు గణేశ్రావు, మా ర్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మందా రాజేందర్రెడ్డి, జిల్లా నాయకుడు అంకు సురేందర్ పేర్కొన్నా రు. మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ ఈనెల 27వ తేదీ రైతు సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు మహాధర్నా విజయవంతం కావడంతో జీర్ణీంచుకోలేని అధికార కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు నమోదు చేయించారన్నారు.
రైతు ధర్నా కోసం బీఆర్ఎస్ తరఫున అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేశామని, వారే వచ్చి ఇక్కడ స్టేజి ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తే వారి సూచన మేర కు స్టేజి ఏర్పాటు చేశామన్నారు. కానీ వారిపై ఎవరి ఒత్తిడి ఉందో తెలియదు కానీ మాపై కేసులు చేశారన్నారు. రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేపడితే రైతులకు న్యాయం చేసేది పోయి తిరిగి ధర్నా ఎట్లా చేస్తారని మాపై కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.
మీరు ఎన్ని కుట్రలు చేసినా రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేయడం ఆగదన్నారు. మండలంలోని సీఎం సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో మాత్రమే అభివృద్ధి పరుగులు పెడుతుందని, మిగిలిన గ్రామాలు ఏం పాపం చేశాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మండల కాంగ్రెస్ నేతలకు మండలంపై ప్రేమ ఉంటే ప్రతి గ్రామ అభివృద్ధికి రూ.5 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయించి మండల అభివృద్ధికి పాటు పడాలని వారు కోరారు. సమావేశంలో మండల నాయకులు ఎల్లాగౌడ్, నాయకులు నిజాముద్దీన్, భాస్కర్, జంగయ్య, మురళి, శివకుమార్, సుమన్, జంగయ్య పాల్గొన్నారు.