మహబూబ్‌నగర్, జూలై 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/పాలమూరు : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ కార్యదర్శిపై కాంగ్రెస్ నేత, మార్కెట్ వైస్ చైర్మన్ దాడి చేసిన ఉదంతం తీవ్ర సంచలనం సృష్టించింది. భయభ్రాంతులకు గురైన సిబ్బంది కార్యాలయానికి తాళం వేసుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. తన మాట వినడం లేదంటూ మార్కెట్ వైస్ చైర్మన్ కార్యదర్శి గల్లా పట్టుకొని దాడికి దిగాడు.
తనపై దాడి జరిగిన విషయాన్ని కార్యదర్శి నేరుగా పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మధ్యాహ్నం జరిగినా పోలీసు యంత్రాంగం కనీసం సదరు నేతను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మాట్లాడకపోవడం పలు విమర్శలకు దారితీసింది. మార్కెట్ కార్యాలయంలో కార్యాలయ సిబ్బందికి రక్షణ లేకుండా పోయిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాటకీయ పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఎట్లకేలకు కాంగ్రెస్ నేతపై కేసు నమోదు చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి భాస్కర్‌పై కాంగ్రెస్ నేత మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్‌కుమార్ అనుచరులతో వెళ్లి కార్యాలయంలో నానా హంగామా సృష్టించారు. ప్రతి ఏటా మార్కెట్లో లైసెన్స్ కూలీలకు యూ నిఫామ్స్ పంపిణీ చేస్తున్నారు. అయితే తాను చెప్పిన కొంతమందికి లైసెన్స్ లేకుండా యూనిఫామ్స్ ఇవ్వాలని కార్యదర్శిపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఆయన ఇది రూల్స్‌కు విరుద్ధం.. మార్కెట్ చైర్మన్ బెక్కరి అనితతో మాట్లాడతానని చెప్పడంతో తనకే ఎదురు చెబుతావా..? అంటూ ఒక్కసారిగా లేచి కార్యదర్శి గల్లా పట్టుకుని సిబ్బంది ముందే దాడికి దిగారు.
ఈ ఘటనతో కార్యాలయ సిబ్బంది కార్యదర్శి భయభ్రాంతులకు గురయ్యారు. కార్యదర్శి వెంటనే తేరుకొని టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. తనపై దాడి జరిగిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దాదాపు రెండు గం టల తర్వాత పోలీసులు కార్యదర్శి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ న మోదు చేశారు. అనంతరం కార్యదర్శిని ప్రభుత్వ దవాఖానకు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఇదిలా ఉం డగా మార్కెట్ వైస్ చైర్మన్ సాక్షాత్తు కార్యదర్శిపై దాడి చేసి నా పోలీసులు కనీసం ఆయన్ను స్టేషన్‌కు పిలిపించకపోవడం.. స్టేట్మెంట్ రికార్డు చేయకపోవడంతో కేసును నీ రుగార్చే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
రైతులు తాము కష్టపడి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకువచ్చే పవిత్రమైన ప్రదేశంలో కాంగ్రెస్ నాయకులు రోజు తాగి తందానలు ఆడుతున్నారని సిబ్బంది చెప్పడం గమనార్హం. గతంలో ఎన్నోసార్లు కాంగ్రెస్ నాయకులకు ఈ విషయం చెప్పినా పట్టించుకోలేదని వారు అంటున్నారు. వైస్ చైర్మన్ కార్యాలయానికి వచ్చి ఇక్కడే తాగి తిని పోతారని.. సిబ్బందిని దూషిస్తారని ఇదంతా నిత్యకృత్యమని అన్నారు.
అంతటితో ఆగకుండా పార్టీ కార్యకర్తలతో పంచాయితీలు, సెటిల్మెంట్లు కూడా ఇక్కడే చేస్తున్నారని ఏకంగా కార్యదర్శి తన ఫిర్యాదులో పేర్కొనడం ఇందుకు నిదర్శనం. మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌కు మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. దీంతో ఈ రెండు వర్గాల మధ్య కార్యాలయంలో పనిచేయలేకపోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. మరోవైపు తమపై కూడా వేధింపులు ఎక్కువయ్యాయని కమిషన్ ఏజెంట్లు కూడా వాపోతున్నారు. బీఆర్ఎస్ హయాంలో మార్కెట్ కార్యాలయాన్ని పవిత్రంగా చూశారని.. ఇప్పుడేమో ఇలా తయారు చేశారని వ్యాపారస్తులు పెదవి విరుస్తున్నారు.
జిల్లా కేంద్రంలోని మార్కెట్ కార్యాలయంలో ప్రభుత్వ కార్యాలయం సిబ్బందికి భద్రత లేకుం డా పోయిందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో మార్కెట్ కార్యాలయ ఉద్యోగులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. దాడి ఘటన జరిగిన తర్వాత కార్యాలయానికి తాళం వేసుకొని లోపల విధులు నిర్వర్తించారు. జరిగిన ఘటనపై ఎవరు నోరు మెదపడం లేదు.
ఏం మా ట్లాడితే ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయంతో ఉన్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా జిల్లా కేంద్రంలో ఆ పార్టీ నాయకుల దౌర్జన్యాలపై ఒక్కొక్కరుగా బయటికి చెప్పుకుంటున్నా రు. ఇప్పటికైనా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటేనే ఉద్యోగుల్లో మనోధైర్యం పెరుగుతుందని.. లేకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని ఉద్యోగులు ప్రకటించారు.
మహబూబ్‌నగర్ మార్కెట్ కార్యాలయంలో జరిగిన దాడిపై కార్యదర్శి ఫిర్యాదు మేరకు మార్కెట్ వైస్ చైర్మన్ పెద్ద విజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. సుమారు 12 గం టల సమయంలో కార్యాలయానికి వచ్చిన వైస్ చైర్మన్ నేరుగా కార్యదర్శి రూముకు వెళ్లి గొడవకు దిగారని.. మాట వినడం లేదని ఏకంగా దాడి చేశారని వచ్చిన ఫిర్యాదుతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. మార్కెట్ కార్యదర్శిపై జరిగిన దాడి ఘటనలో వైస్ చైర్మన్ విజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు ధ్రువీకరించారు.