మాజీ సర్పంచులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధకాండ కొనసాగింది. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మాజీ సర్పంచులు తరలివెళ్లకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ఉదయమే ముందస్తుగా అరెస్టు చేసిన వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న తమను అరెస్టు చేయడం ప్రజాపాలన సిద్ధాంతమా? అంటూ నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ఏమీ అడగకూడదా..? ప్రశ్నించే గొంతుకలను నొక్కుతారా..? పెండింగ్ బిల్లులు విడుదల చేయకుండా అరెస్టులా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన నేతలను అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు.
– నెట్వర్క్ మహబూబ్‌నగర్, డిసెంబర్ 9