మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ హయాంలో 85శాతం పనులు పూర్తిచేయగా, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మిగిలిన పనులను పూర్తి చేసేందుకు కాలయాపన చేస్తున్నది. దీంతో బీఆర్ఎస్ భారీఎత్తున ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతులతో కలిసి భారీఎత్తున ఆందోళన చేపట్టేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టు పనులు చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఇటీవల మాజీ మంత్రుల నేతృత్వంలో ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సమావేశమయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రైతాంగంలో చైతన్యం తీసుకొచ్చి నిధులు కేటాయించేలా భారీఎత్తున ఉద్యమం చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పథకం ఆవశ్యకత గురించి ప్రజలకు, రైతాంగానికి వివరించనున్నారు. ఆ తర్వాత కొల్లాపూర్ నుంచి ఆందోళన బాట చేపట్టాలని.. అన్ని నియోజక వర్గాల్లో మాజీ ఎమ్మెల్యేల నేతృత్వంలో ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి సీఎం అయిన ప్పటికీ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పడావు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్య మంత్రి పదవి అనుభవిస్తూ కూడా ఉమ్మడి జిల్లాకు సాగునీటి ప్రాజెక్టుపై వివక్ష చూపడాన్ని ఎత్తిచూపాలని నిర్ణయించారు. కొల్లాపూర్ నుంచి ఉద్యమ
కార్యాచరణ ప్రారంభించి
ఈ మేరకు రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మలిచేలా పావులు కదుపుతున్నారు. ఆందోళన కార్యక్రమం ప్రారంభం రోజు మాజీ మంత్రులు హరీశ్‌రావు లేదా కేటీఆర్‌ను ఆహ్వానించాలని.. ముగింపు రోజు కేసీఆర్‌ను మహబూబ్‌నగర్‌కు ఆహ్వానించి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ నేతలు కార్యాచరణ రూపొందిస్తున్నారు. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను నిర్లక్ష్యం చేయడం, మిగతా ఎత్తిపోతల పథకాలకు సకాలంలో నీళ్లను పంపింగ్ చేయక పోవడాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు.
మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాతోపాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు పారిశ్రామిక అవసరాలకు, తాగునీటికి ఉద్దేశించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ నేతృత్వంలో వేగవంతంగా పనులు చేపట్టారు. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో పంప్ హౌస్‌లు, రిజర్వాయర్ల పనులు చేపట్టి దాదాపు 85శాతం పూర్తి చేశారు. 2023 అక్టోబర్‌లో కేసీఆర్ ఈ పథకం మొదటి దశ పనులు ప్రారంభించారు. నార్లాపూర్ రిజర్వాయర్లు దాదాపు రెండు టీఎంసీల నీటిని రెండు రోజుల్లోనే పంపులతో నింపారు.
ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం.. ఉమ్మడి జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి సీఎం కావడంతో ఈ ప్రాజెక్టుపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎక్కడ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందోనని కాంగ్రెస్ నేతలు నయా పైసా విడుదల చేయకుండా ఎక్కడి పనులు అక్కడ నిలిపివేశారు. ఈలోగా భారీ వర్షాలకు వట్టెం పంప్‌హౌస్ నీటమునిగింది. ఈ ఏడాది కృష్ణానదికి ఎన్నడూ లేని విధంగా మే నెలలోనే వరదలు ప్రారంభమయ్యాయి.
ఈ నీటిని ఎత్తిపోతల పథకాలకు పంపిణీ చేయాల్సి ఉండగా, దాన్ని కూడా నిర్లక్ష్యం చేయగా, ఆ తర్వాత భారీ వర్షాలకు నిండిపోయాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఉంటే కృష్ణానది నుంచి నీటిని ఎత్తిపోసి అన్ని రిజర్వాయర్లలో నింపితే దాదాపు 75 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండేవని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఈ పథకం పూర్తయితే పాలమూరు జిల్లా శాశ్వత కరువు నివారణ అవుతుందని, అందుకే కేసీఆర్ ఈ పథకాన్ని చేపట్టారన్నారు.
పాలమూరు పథకంపై ప్రభుతాన్ని నిలదీసేందుకు పెద్ద ఎత్తున పాదయాత్రకు శ్రీకారం చుట్టాలని మాజీ మంత్రుల నేతృత్వంలో సమావేశంలో నేతలందరూ నిర్ణయించారు. ఈ మేరకు రోడ్ మ్యాప్‌ను రెడీ చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక ప్రాజెక్టుపై వహిస్తున్న నిర్లక్ష్యాన్ని వివరించేందుకు ప్రచారంలో భాగంగా కరపత్రాల పంపిణీతోపాటు ఇతర కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిసింది. వారం, పది రోజులపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మండల, గ్రామ స్థాయిలో చర్చ జరిగేలా పార్టీ కార్యకర్తలను సైతం భాగస్వామ్యం చేయాలని భావిస్తోంది. మొత్తంగా పీఆర్ఎల్ఐ ఆవశ్యకతకను వివరించడంతోపాటు ప్రభుత్వం మెడలు వంచి పనులు పూర్తి చేసేలా కారు పార్టీ సిద్ధమవుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో గుబులు మొదలైంది.
పీఆర్ఎల్ఐపై పోరుబాట కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి పట్టాలని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతు లను తరలించి ఇక్కడి నుంచి సమరశంఖం పూరించాలని చూస్తున్నారు. నార్లాపూర్ వద్ద కృష్ణా నీటిని ఎత్తిపోసే చోటు నుంచి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. కర్షకులను చైతన్య వంతం చేసే దిశగా కార్యక్రమాలు చేపట్టాలని, పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని నిర్ణ యించారు. అన్ని నియోజకవర్గాల్లో ఆందోళ నలు చేపట్టి చివరకు మహబూబ్‌నగర్ నిర్వ హించే భారీ సభకు గులాబీ బాస్‌ను రప్పిం చాలని చూస్తున్నారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మలచాలని నేతలు
భావిస్తున్నారు.