ఊట్కూర్ : కాంగ్రెస్ పార్టీ ( Congress Party) అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల్లో 420 హామీలతో ( Promise ) ప్రజలను మోసం చేసిందని నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల బీఆర్ఎస్ యువజన నాయకులు ( BRS Youth leaders ) కోరం శివరాజ్ రెడ్డి, వడ్ల మోనప్ప, గంగాధర్ చారి ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్ఎస్ ను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెకు లేదని విమర్శించారు.
అధికారమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఆచరణ సాధ్యం కానీ హామీలను ఇచ్చి కేసీఆర్ ( KCR ) ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కిందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి హయాంలో మక్తల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితో మక్తల్ను సస్యశ్యామలం చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కే దక్కిందన్నారు.
6 గ్యారెంటీలో పేరుతో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు లబ్ధిదారులకు ఇస్తామన్న తులం బంగారం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు రైతు బంధు ఎకరాకు రూ. 15వేలు ఇస్తామని చెప్పి రైతులను నట్టేట ముంచిందని, ఇప్పటివరకు ప్రభుత్వం రెండు విడతలలో ఎగ్గొట్టిన రైతు బంధు డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఆసిఫ్, జమాల్ ఖాన్, కుమ్మరి శ్రీకాంత్, ప్రశాంత్ కుమార్, వడ్డే పెద్ద హన్మంతు పాల్గొన్నారు.