పాన్‌గల్, మార్చి 9 : పదేండ్ల కేసీఆర్ పాలనలోనే అన్నివర్గాల ప్రజలకు మేలు చేకూరిందని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సూరారంలో తెల్లరాళ్లపల్లి తండా కు చెందిన 100మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీరం మాట్లాడుతూ ఎలాగైనా అధికారంలోకి రావాలని అమలుకు సాధ్యం కాని హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను అధికారంలోకి వచ్చాక నిండా ముంచిందన్నారు.
ఆరు గ్యారెంటీలతోపాటు రైతు, యువ, బీసీ డిక్లరేషన్లను ప్రకటించి, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. రైతుభరోసా, రూ.2లక్షల రుణమాఫీ, సాగు, తాగునీటిని అందించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి తిరగడానికే సమయం సరిపోవడం లేదని, రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ బంధం కొనసాగుతుందని ఆరోపించారు. మాదిగలు, మాదిగ ఉపకులాలపై బీఆర్ఎస్ చిత్తశుద్ధితో పనిచేసిందని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రంగినేని అభిలాశ్‌రావు, మాజీ ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌నాయక్, నాయకులు కిషన్‌నాయక్, చక్రీగౌడ్ తదితరులు పాల్గొన్నారు.