వనపర్తి (నమస్తే తెలంగాణ), నవంబర్ 8 : ఉచిత వేరుశనగ విత్తనాల పంపిణీ గందరగోళం నెలకొన్నది. ఇందుకు రైతుల ను ఎంపిక చేసిన విధానం నుంచి పంపిణీ చేసే వరకు అస్తవ్యస్తంగా కొనసాగింది. జిల్లాలోని మూడు వ్యవసాయ డివిజన్లకుగానూ కేవలం రెండు డివిజన్ల పరిధిలోని మూడు మండలాలకు మాత్రమే ఉచితంగా అందించారు. కొత్తకోట వ్యవసాయ డివిజన్లోని ఒక్క మండలానికి కూడా ఉచిత వేరుశనగను అందివ్వకపోవడంపై అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
వీటిలో వనపర్తితోపాటు పానగల్, కొత్తకోట డివిజన్లుగా కొనసాగుతున్నాయి. ఒక్కో డివిజన్‌కు 5 మండలాల చొప్పున కేటాయించారు. ప్రస్తుతం వనపర్తి జిల్లాకు 3,600 క్వింటాళ్ల ఉచిత వేరుశనగను ఎన్ఎంవో (నేషనల్ మిషన్ ఆయిల్ సీడ్స్) పథకంలో కేటాయించడం జరిగింది. ఇందుకు వనపర్తి వ్యవసాయ డివిజన్లోని పెద్దమందడి, పెబ్బేరుతోపాటు పాన్‌గల్ వ్యవసాయ డివిజన్ కేంద్రాన్ని మాత్రమే ఎంపిక చేశారు. ఇక కొత్తకోట వ్యవసాయ డివిజన్ పరిధిలోని ఒక్క మండలాన్ని కూడా ఎంపిక చేయకుండానే మమా అనిపించారు. దీంతో కొత్తకోటతోపాటు మదనాపురం, ఆత్మకూరు, అమరచింత మండలాల రైతులు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే వేరుశనగ తమకు అందకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంపిణీ పక్కదారి..
వనపర్తి జిల్లాలో అధిక శాతం రైతులు వేరుశనగను విత్తుకున్నారు. దీంతో ప్రస్తుతం ఉచితంగా పంపిణీ చేస్తున్న వేరుశనగను రైతులు విత్తేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. 45రోజుల కిందట వేరుశనగను రెండో పంటగా వేసుకున్నారు. ఉచిత పంపిణీని ఎలాంటి కొలమాణం లేకుండానే నాయకుల సిఫారసుతో చేపట్టడంతో పంపిణీ పక్కదారికి మార్గం సుగమమైందన్న ఆరోపణలున్నాయి. కేవలం వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలోనే జరిగి ఉంటే కనీస మాత్రంగానైనా ఉచిత వంగడాల మొక్కలు కనిపించేవన్న అభిప్రాయం ఉన్నది.
ఇష్టపడని రకం..
ఉచితంగా పంపిణీ చేసిన వేరుశనగ రకాన్ని రైతులు ఇష్టపడటం లేదు. జిల్లాలో ఎక్కువగా ట్యాగ్లు, కే6 రకాలతోపాటు మరికొన్ని ఇతర రకాలను కూడా రైతులు విత్తుకుంటున్నారు. అయితే, సర్కారు పంపిణీ చేసిన కదిరి లేపాక్షి రకాన్ని రైతులు విత్తడానికి ఆసక్తి చూపడం లేదు. జి ల్లాలో ప్రస్తుతం 17వేల ఎకరాల్లో వేరుశన పంటను రైతులు సాగుచేశారు. కొన్ని చోట్ల పంటలు చేతికి రాగా, మరికొన్ని చోట్ల ఊడలు దిగే దశలో ఉన్నాయి. ప్రస్తుతం తీసుకున్న ఉచిత వేరుశనగ జిల్లాలో ఎక్కడైనా విత్తారా అని అడిగితే అధికారుల నుంచి మౌనమే సమాధానంగా ఉన్నది. విత్తు సంగతి అటుంచితే.. కనీసం పంపిణీ చేసిన లిస్టులు కూడా ఇవ్వలేని దుస్థితి కనిపిస్తున్నది.
పంపిణీలో గందరగోళం..
కేవలం మూడు మండలాలకు కేటాయించిన ఉచిత వేరుశనగ విత్తనాల పంపిణీలో గందరగోళం నెలకొన్నది. పూర్తిగా పంపి ణీ జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే.. ఇంకా వేరుశనగ బస్తాలు మిగిలి ఉండ టం అనుమానాలకు తావిస్తున్నది. పెద్దమందడి మండలంలో స్థలం లేదని గోపాల్పేట మండల కేంద్రంలోని రైతువేదికలో నిల్వ చేసినట్లు అక్కడి వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అదే రైతువేదికలో ఇంకా ఉచిత వేరుశనగ బస్తాలు నిల్వ ఉన్నాయి. ఉన్నదే చాలా తక్కువ.. ఇప్పటికే గడువు మి ంచిపోయింది.. ఇంకా రైతులకివ్వకుండా తాత్సారం చేయ డం ఎందుకన్నది అధికారులకే తెలియాలి. ఇదిలా ఉంటే, కేటాయించిన ఉచిత వేరుశనగను పెబ్బేరులో 492.4 క్వింటా ళ్లు, పెద్దమందడిలో 690 క్వింటాళ్లను మాత్రమే రైతులకు అందజేసినట్లు చెబుతున్నారు. ఈ మండలాల్లోని రైతులు ఈ సీడ్‌ను తీసుకోవడానికి ఇష్టపడనందునా తక్కువ పంపిణీ జరిగిందంటున్నారు. ఇచ్చిన విత్తనాలు సైతం పాన్‌గల్ మండలంలో ముందుగా ఒక్కో రైతుకు నాలుగు సంచులు ఇచ్చి, ఆ తర్వాత రెండు సంచులను ఇవ్వడం వివాదాస్పదమైంది.
విత్తనాల ఉచిత పంపిణీ ముగిసింది..
ఈ సీజన్లో ఉచిత వేరుశనగ విత్తనాల పంపిణీ పూర్తయ్యింది. ఇప్పుడిచ్చిన సీడ్ గతంలో ఎంపిక చేసినవే. రెండు వ్యవసాయ డివిజన్లలో ఒక్కో మండలాన్ని తీసుకుని పంపిణీ చేశాం. కొత్తకోట వ్యవసాయ డివిజన్లోని రైతులు ఈ సీడ్స్‌ను ఇష్టపడనందునా ఆ ప్రాంతంలో ఇవ్వలేదు. వచ్చే ఏడాది పూర్తిస్థాయిలో ఉచిత వేరుశనగ పంపిణీని ప్రాధాన్యతగా తీసుకుంటాం.
– ఆంజనేయులు గౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, వనపర్తి