మహబూబ్‌నగర్, మే 17: పాలమూరు పేరుప్రఖ్యాతలు మరింత ఉన్నతస్థాయికి తీకొచ్చేందుకుగానూ మినీ ట్యాంక్‌బండ్ తలమానికంగా మారుతుందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌బండ్ వద్ద రూ.14కోట్లతో సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవల రూ.25కోట్లతో నెక్లెస్ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించినట్లు గుర్తుచేశారు. 265 మీటర్ల పొడవు, 5ఫీట్ల వెడల్పుతో సస్పెన్షన్ బ్రిడ్జి, ట్యాంక్‌బండ్ మధ్యలో సుమారు ఎకరా స్థలంలో ఐలాండ్(దీవి) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్వచ్ఛమైన నీటితో తెలంగాణలోనే మొదటి సారి ఏర్పాటు చేయనున్న ఐలాండ్, సస్పెన్షన్ బ్రిడ్జి వరకు వెళ్లేందుకు బోటు సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
దివిటిపల్లిలో 400 ఎకరాల్లో ఐటీ పార్కును మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయగా, మరో 400 ఎకరాల్లో హన్వాడ మండలంలో ఫుడ్‌పార్కు పనులు కొసాగుతున్న విషయాన్ని గుర్తుచేశారు. గతంలో దుర్వాసనతో కూడిన పెద్ద చెరువును మంచినీటితో నింపి ఎల్లప్పుడు శుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహబూబ్‌నగర్ చుట్టు పక్కల భూముల ఇండ్లు, ప్లాట్లకు మంచి ధరలు వస్తున్నాయని తెలియజేశారు. 10సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌కు సమాంతరంగా మహబూబ్‌నగర్ తయారు కానున్నదన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవార్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పలపాటి శ్రీనివాస్‌గుప్తా, టూరిజం ఎండీ మనోహర్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్, కౌన్సిలర్ రాంలక్ష్మణ్, మాజీ చైర్మన్ రాజేశ్, ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చక్రధర్, డీఈ మనోహర్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్ ఉన్నారు.