జడ్చర్లటౌన్, మే 25 : కొడుకులు, బంధువులు ఉన్నా..అనాథగా మిగిలిందామె…తల్లి చనిపోయిందని తెలిసినా కడచూపు చూసేందుకు కొడుకులు ముందుకురాలేదు. చివరికి కాలనీవాసులే ముందుకొచ్చి సదరు మహిళ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన జడ్చర్లలో వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. 25ఏండ్ల కిందట శాంతమ్మ(65) అనే మహిళ తన భర్తతో కలిసి జడ్చర్లకు వచ్చి లక్ష్మీనగర్కాలనీలో నివాసముంటున్నది.
ఆమెకు ఇద్దరు కొడుకులు. ఈమె భర్త ఏడేండ్ల కిందట మృతిచెందడంతో అప్పటి నుంచి శాంతమ్మ ఒంటరిగా లక్ష్మీనగర్కాలనీలోని బంగారు మైసమ్మ ఆలయంలోనే పూజారిగా పనిచేస్తూ కాలనీవాసుల సాయంతో సమీపంలోని కమ్యూనిటీహాల్లో నివాసం ఉంటూ జీవనం కొనసాగించింది. శనివారం ఉదయం కమ్యూనిటీహాల్లోనే శాంతమ్మ మృతిచెందింది. విషయాన్ని తెలుసుకున్న కాలనీవాసులు వెంటనే ఆమె కొడుకులకు ఫోన్లు చేయగా స్పందించలేదు.
బంధువులకు ఫోన్లు చేసి సమాచారం ఇచ్చినా ఎవరూ ఆమెను చూసేందుకు రాలేదు. ఆదివారం మధ్యాహ్నం వరకు ఆమె పార్థివదేహాన్ని మైసమ్మ ఆలయం వద్దనే ఉంచి ఆమె కొడుకులు, బంధువుల కోసం ఎదురుచూశారు. చివరికి పోలీసులకు సమాచారం ఇచ్చి కౌన్సిలర్ శశికిరణ్, కాలనీవాసులు కొంగళి మోహన్రాజ్, రవీందర్ సహకారంతో కాలనీవాసులే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.