నాగర్‌కర్నూల్, మే 30 : జిల్లాలో వానకాలం సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో నకిలీ విత్తన వ్యాపారాలపై అధికారులు పటిష్ట నిఘా పెట్టాలని వ్యవసాయ, పోలీస్ అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్ బృందాలను కలెక్టర్ ఉదయ్‌కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఉదయ్‌కుమార్ అ ధ్యక్షతన వ్యవసాయ, పోలీస్‌శాఖలతో ఏర్పాటు చే సిన టాస్క్‌ఫోర్స్ బృందాల అధికారులతో నకిలీ వి త్తనాలు, ఎరువులపై తీసుకోవాల్సిన చర్యలపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వానకాలంలో 4.59 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని, అ త్యధికంగా 2,73,720 ఎకరాల్లో పత్తి, 1,40,082 ఎకరాల్లో వరి, 45,237 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగు చేస్తారన్నారు.
జిల్లావ్యాప్తంగా 663 విత్తన విక్రయ కేంద్రాలున్నాయని.. నకిలీ విత్తనా లు, ఎరువుల విక్రయాలను అరికట్టడానికి మండలానికో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. పోలీస్, వ్యవసాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ సభ్యులు జిల్లాలోని ఆ యా ప్రాంతాల్లో సోదాలు చేయాలని, నాసిరకం వి త్తనాలు అమ్మేవారిపై పీడీయాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు. వ్యాపారులు నకిలీ, నాసిరకం విత్తనాలను రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తార ని, వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అనుమతి లేని, బీటీ-3, నకిలీ విత్తనాలను వ్యాపారులు మా ర్కెటింగ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారని.. వాటివల్ల దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్ర మాదం ఉంటుందన్నారు.
దీనిని అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాలు వి స్తృతంగా త నిఖీలు చేపట్టాలన్నారు. సీడ్ సప్లయిం గ్ ధ్రువీకరణ పత్రాలు, ఎరువులు, దుకాణాల లైసెన్స్‌లు, స్టాక్‌ను బృందాలు క్షుణ్ణంగా పరిశీలించాలని.. రోజువారీ విక్రయాలను కూడా తనిఖీ చేయాలన్నారు. రసీదులపై ఏఈవోలు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. నకిలీల బారిన పడకుండా అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. లైసెన్స్‌లు పొందిన డీలర్ల వద్దే విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొనుగోలు చేయాలని, డీలర్ల సంతకంతో కూడిన రసీదును తప్పకుండా తీసుకోవాలని సూచించారు.
కొనుగోలు చేసిన తేదీ, విత్తనాల ర కం, పరిమాణం, ధర, లాట్ నెంబర్ తదితర వివరాలను రసీదులో నమోదు చేయించుకొని పంట చేతికొచ్చే వరకు భద్రపర్చుకోవాలన్నారు. రంగు ప్యాకెట్లను చూసి మోసపోవద్దని, కంపెనీ విశ్వసనీయత, విత్తనాల నాణ్యత, మొలక శాతాన్ని పరిశీలించి కొనుగోలు చేయాలన్నారు. బిల్లులు లేకుండా తక్కువ ధరలకు విత్తనాలు అమ్మే వారిపై ప్రత్యేక దృష్టి ఉంచాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు కుమార్‌దీపక్, సీతారామారావు, జిల్లా వ్యవసాయాధికారి చంద్రశేఖర్, డీఎస్పీ శ్రీనివాసులు, వ్యవసాయ, పోలీస్ శాఖల అధికారులు పాల్గొన్నారు.