జోగులాంబ గద్వాల : ధరూర్ మండలంలోని చింతరేవుల గ్రామంలోని జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (Nettempadu Project) డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ భూసేకరణ పనులను జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ( Collector BM Santosh ) శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ వివరాలు, లేఅవుట్ మ్యాప్, పెగ్ మార్కింగ్ చేసిన ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూసేకరణ సర్వే పనులకు నిధుల కొరత లేదని, ఏ విధమైన ఆలస్యం లేకుండా త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రోజు ఎంత మేర భూమిపై సర్వే జరుగుతోంది. ఎన్ని ఎకరాలు పూర్తయ్యాయి. అనే వివరాలను స్పష్టంగా నమోదు చేసి నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.
సర్వే, పెగ్ మార్కింగ్ పనులను ఒకేసారి జరుపుతూ రైతులను చైతన్యపరచి వారి సహకారంతో భూసేకరణను సమర్థవంతంగా పూర్తి చేయాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సర్వే ల్యాండ్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తయితే ఆయకట్టు విస్తీర్ణం పెరిగి రైతులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ, నీటి పారుదల శాఖ ఎస్ఈ రహీముద్దీన్,ఆర్డీవో శ్రీనివాసరావు, ధరూర్ తహసీల్దార్ భూపాల్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.