కల్వకుర్తి/ఊర్కొండ, జూలై 2 : సీ ఎం రేవంత్రెడ్డి రా కతోనైనా పూజారుల ఆ గడాలకు చరమగీతం పాడేనా అనే ప్రశ్నలు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి. అయిన వారికి ఆకుల్లో కా ని వారికి కంచాల్లో అనే చందంగా ఆలయంలో పనిచేసే కొందరు పూజారులు వ్యవహరిస్తుండడం తో సామాన్య భక్తులు తీవ్ర ఇ బ్బందులకు గురవుతున్నారు. ప్రముఖ శక్తి స్థలంగా పేరుగాంచిన అభయాంజనేయుని న మ్ముకొని వస్తున్న భక్తులకు ఆలయ పూజరులు కొంద రు చుక్కలు చూపిస్తున్నారనే ఆరోపణల నేపథ్యం లో సీఎం రాక ప్రాముఖ్యత సంతరించుకున్న ది. నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ఊర్కొండపేట అభయాంజనేయస్వామి ఆలయానికి శనివా రం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వస్తున్నారు. ఇందుకో సం అధికార య ంత్రాంగం ఏ ర్పాట్లలో ము నిగిపోయిం ది.
పేరుకే ఎండోమెంట్.. పెత్తనమంతా పూజారులదే..
ఊర్కొండపేట ఆభయాంజనేయస్వామి అంటే భక్తులకు విపరీతమైన నమ్మకం. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి వస్తుంటారు. ప్రతి శనివారం రాత్రి స్వామి వారి సన్నిధిలో నిద్రిస్తుంటారు. ప్రతినిత్యం దేవాలయంలో సత్యనారాయణస్వామి వ్రతాలను ఆచరిస్తుంటారు. శక్తి స్థలంగా భావించి అభయాంజనేయుని సన్నిధికి వస్తున్న భక్తులకు కొందరు పూజారులు చుక్కలు చూపిస్తున్నారు. దేవాలయ పూజారులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తూ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు మూట గట్టుకుంటున్నారు. దేవాలయం నిర్వహణ అంతా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నా.. ఇక్కడ మాత్రం పెత్తనం అంతా పూజారులదే అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూజారుల ప్రక్షాళన చేస్తే తప్పా మరో మార్గం లేదని భక్తులు అంటున్నారు.
ప్రధాన అర్చకునికే దిక్కులేదు..
అభయాంజనేయస్వామి ఆలయంలో దేవాదాయ శాఖకు సంబంధించి ఒక ప్రధాన అర్చకుడు, సహాయ అర్చకుడు ఉన్నారు. తాత్కాలిక వేతన పద్ధతిపై మరో ఇద్దరు అర్చకులు పూజలు నిర్వహిస్తున్నారు. అత్యంత విచిత్రమైన విష యం ఏమిటంటే ప్రధాన అర్చకుడు అభయాంజనేయుని గుడిలో పూజలు చేయలేని పరిస్థితి ఉంది. ప్రధాన ఆలయం పక్కనున్న శివాలయానికి మాత్రమే ప్రధాన అర్చకుడు పరిమితమైన దుస్థితి ఉంది. అభయాంజనేయుని ఆలయంలో పనిచేస్తున్న తాత్కాలిక పూజారులు ప్రధాన అర్చకున్ని దేవాలయంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ఇదే విషయమై ప్రధాన అర్చకుడికి, తాత్కాలిక పూజారులకు గొడవ జరిగిన సందర్భాలు ఉన్నాయి.
కాసులిస్తేనే కనికరిస్తారు..
ఆలయంలో దేవాలయశాఖ అధికారులది ప్రేక్షక పాత్ర అనేదానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నా యి. గత మూడేళ్ల కిందట ఆలయంలో పనిచేస్తున్న తాత్కాలిక పూజారి ఒకరు ఆలయ ఈవోపైనే దాడికి తెగబడ్డారు. ఈ పంచాయితీ పోలీసుల వద్దకు కూడా చేరుకుంది. అయినా ఈవో (ప్రభుత్వ ఉద్యోగి)పై దాడి చేసిన తాత్కాలిక పూజారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీన్ని బట్టి చూస్తే తాత్కాలికి పూజారులదే ఆలయం లో పెత్తనం అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆలయంలో పూజారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. సామాన్య భక్తులు దేవుడి దర్శనానికి, అర్చన తదితర పూజా కార్యక్రమాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. అదే కాసులున్న భక్తులు వస్తే వారికి మాత్రం రాచమర్యాదలు లభిస్తాయి. వారికి గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. టికెట్ కొనుగోలు చేసి దేవాలయానికి వచ్చే భక్తులను మాత్రం ఏ మాత్రం పట్టించుకోరు.
దేవునికే శఠగోపం..
ఇక్కడ పనిచేస్తున్న అర్చకులలో కొందరు దేవునికే శఠగోపం పెడుతున్నారు. స్వామిని దర్శించుకొని పదో పరకో దేవుని హుండీలో డబ్బులు వేయాలనుకున్న భక్తులకు కొందరు పూజారులు తమకు పల్లెంలో దక్షిణ వేయాలని డిమాండ్ చేస్తారు. దక్షిణ ఇవ్వకుంటే కించపరిచే విధంగా మాట్లాడుతారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఎందరో భక్తులు దేవాలయశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాథుడే లేదు. మరో ప్రధానమైన అంశం ఏమిటంటే గుడికి రెండు వైపు లా ఉన్న గ్రామాల ప్రజలు సదరు పూజారుల గురించి బహిర్గతంగా మాట్లాడటానికి విపరీతంగా జంకుతున్నారు. పూజారులకు వ్యతిరేకంగా మాట్లాడితే మం త్రాలు, తంత్రాలు చేసి, తాయత్తులు కట్టి ఇబ్బందుల పాలు చేస్తారని భయపడుతున్నారు.
వాహనాలను పూజకు తీసుకువస్తే..
భక్తులు తాము కొనుగోలు చేసిన కొత్త వాహనాలను అభయాంజనేయుని వద్ద పూజలు చేయిస్తారు. వాహనాల పూజలు పూజారులకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఆలయ కౌంటర్ నుంచి డబ్బు చెల్లించి వాహనాలకు సంబంధించిన రసీదు తీసుకుంటారు. ఆ తర్వాత వాహనాలకు పూజారులు వచ్చి పూజలు నిర్వహిస్తారు. పూజ కోసం వాహనాలు తీసుకురావడంతోనే పూజారులు అందరు కట్టగట్టుకొని పోటాపోటీగా వాహనం వద్దకు వస్తారు. తాము పూజా చేస్తామంటే.. తాము పూజ చేస్తామంటూ గొడవకు దిగుతారు. ఎలాగోలా పూజ అయిన తర్వా త అసలు కథ అప్పుడుంటుంది. దక్షిణ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తారు. ఇచ్చినం తా తీసుకో రు. పూజారులు అడిగినంతా సమర్పించాల్సిం దే. ఒకరిద్దరు పూజారులు మినహా.. మిగతా పూజారులు భక్తులను పీల్చుకుతింటున్నారు.
సత్యనారాయణస్వామి వ్రతాల్లో దోపిడీ..
దేవాలయంలో ప్రతి నిత్యం సత్యనారాయణస్వామి వ్రతాలను భక్తులు ఆచరిస్తారు. మంగళ, శనివారాల్లో వ్రతాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. సత్యనారాయణస్వామి వ్రతాల్లో పూజారుల దోపిడీ అంతా ఇంతా కాదు. వ్రతం ఆచరించిన వారి నుంచి ముక్కుపిండి మరీ డ బ్బులు వసూలు చేస్తారు. ఆలయంలో సత్యనారాయణస్వామి వ్రతం ఆచరించడానికి దేవాదాయ శాఖ కౌంటర్లో రూ.200 చెల్లించి రసీ దు తీసుకోవాలి. ఇందుకు గానూ వ్రతాలను పూ జారులు చేయించాలి. వ్రతం పూర్తయిన తర్వా త వ్రతం పీటను కదిలించాల్సి ఉంటుంది. పూ జారులు వ్రతం పీట కదిలిస్తేనే వ్రతం పూర్తయినట్లు. పూజారులు అడినంత ఇవ్వకపోతే వ్రతం పీటను కదిలించరు. అడిగినంతా ఇవ్వాల్సిందే..
కోట్లకు పడగలెత్తిన వైనం
ఆలయంలో పనిచేస్తున్న పూజారుల్లో కొందరు కోట్లకు పడగలెత్తారు. ప్రతి నిత్యం భక్తుల నుంచి విపరీతమైన ఆదాయం లభిస్తుండడంతో వడ్డీల వ్యాపారానికి తెరలేపారు. పెద్దస్థాయిలో డబ్బు ను వడ్డీలకు ఇస్తున్నారు. పెద్దపెద్ద భవంతులు నిర్మించుకున్నారు. వీరిని ప్రశ్నించే ధైర్యం దేవాలయశాఖ అధికారులు కూడా చేయలేని పరిస్థి తి. శక్తి స్థలంగా వర్ధిల్ల్లుతున్న అభయాంజనేయు ని ఆలయానికి సామాన్య భక్తులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పవిత్ర స్థలానికి సీఎం రేవంత్రెడ్డి వస్తున్న నేపథ్యంలో మార్పు ఏదైనా వస్తుందా అని భక్తులు ఎదురుచూస్తున్నారు.
దేవాలయ అభివృద్ధికి రూ.10కోట్లు
సీఎం రేవంత్రెడ్డి దేవాలయ అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరు చేశారని అధికారులు చెబుతున్నారు. ఈ డబ్బులతో దేవాలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ అధికారులు అంటున్నారు. ఆధునిక అన్నదాన సత్రం, 25 వసతి గదులు, పుష్కరిణి వంటి వాటిని నిర్మించి భక్తులకు చక్కని వసతులు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు.
వచ్చిన ఫిర్యాదులు నిజమే..
ఆలయంలో పనిచేస్తున్న కొంత మంది పూజారులపై ఫిర్యాదులు వస్తున్నది నిజమే. పూజారుల పనితీరుపై ఎండోమెంట్ ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చాం. సీఎం పర్యటన ముగిసిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం. దేవాలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పూర్తి చర్యలు తీసుకుంటాం. భక్తులు హూండీలో డబ్బులు వేసి దేవాలయ అభివృద్ధికి సహకరించాలి. అర్చకులు ఎవరైన డబ్బులు డిమాండ్ చేస్తే తన దృష్టికి తీసుకురావాలి.
– సత్యచంద్రారెడ్డి, ఈవో, అభయాంజనేయస్వామి దేవాలయం