కొల్లాపూర్ : ఎస్సీ వర్గీకరణ ప్రకారం గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా మాదిగలకు ఉప కులాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని కొల్లాపూర్ పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఆర్డీవో కార్యాలయ ఎదుట ఈ రిలే దీక్షలు జరిగాయి. ఒకవైపు వర్గీకరణ చేస్తున్నామని పేర్కొంటూ మరోపక్క విద్యా ఉద్యోగ అవకాశాలు దక్కకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని, మాదిగలను మోసం చేస్తున్నారని మంద నరసింహ మాదిగ అన్నారు.
ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు ఎన్నో త్యాగాలు చేశారని, అలాగే రాష్ట్ర సాధన కోసం కూడా ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని ఎమ్మార్పీఎస్ నాయకులు చెప్పారు. సుప్రీంకోర్టు ఆగస్టు 1న తీర్పు ఇస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణను అమలు చేయడం లేదని అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల అమలు కోసం ఏకసభ్య కమిషన్ రిపోర్టు ఇచ్చినా కూడా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు నోచుకోలేదని చెప్పారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గెజిటెడ్ ఉద్యోగాల నియమాకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు కాలేదని, దీన్నిబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వర్గీకరణ అమలుపై చిత్తశుద్ధి లేదని అర్థమవుతోందని అన్నారు.
దీక్షలలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు, నాగర్ కర్నూల్ జిల్లా కమిటీ నాయకులు శీలం అగ్ర స్వామి, పుట్టపాగ రాము కొల్లాపూర్ మండల ఇన్చార్జి ఏదుల రాముడు, కన్వీనర్ బత్తిని పరమేష్, జాతి పెద్దలు బాలస్వామి, ఎంఈఎఫ్ నాయకులు కారంగి నరసింహ, చిన్న రాము, కేతేపాగా మహేష్ పాల్గొన్నారు. ఈ దీక్షలలో తప్పెట జగదీష్ మాదిగ, కడ్తాల తిరుపాలు మాదిగ తదితరులు పాల్గొన్నారు.