ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం గద్వాల ముస్తాబైంది. జిల్లాకేంద్రంలో రూ.51.18 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, రూ.38.50 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయంతోపాటు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌ను సోమవారం ప్రగతి ప్రదాత ప్రారంభించనున్నారు. విద్యుద్దీప కాంతుల్లో మూడు కార్యాలయాలు తళుకులీనుతున్నాయి. బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, బ్యానర్లతో పట్టణం గులాబీమయంగా మారింది. సీఎం పర్యటనకు అధికారులు పకడ్బందీ ఏరాట్లు చేశారు. 15 వందల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సరిత, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, కలెక్టర్ క్రాంతి, ఎస్పీ సృజనతో కలిసి క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంతకుముందు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పనులను పరిశీలించారు.
మహబూబ్‌నగర్, జూన్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రథ సారథి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సోమవారం నడిగడ్డకు వస్తున్నారు. గద్వాల జిల్లాకేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్, పోలీస్ భవనం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ఆదివారం ప్రారంభించి అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఉద్యమ సమయంలో నడిగడ్డ ప్రజల నీటిహక్కుల కోసం పాదయాత్ర చేసిన కేసీఆర్.. తెలంగాణ వచ్చాక ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి, జిల్లాకేంద్రంగా మార్చడంతో ప్రగతి పరుగులు పెడుతున్నది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నడిగడ్డలో సీఎం పర్యటన విపక్షాల్లో గుబులు రేపుతున్నది. భారీ కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో గద్వాల పట్టణం గులాబీరంగును పులుముకున్నది. జిల్లా ప్రజాప్రతినిధులు స్వాగత సన్నాహాల కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం సభ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, ఎమ్మెల్సీ రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ సరిత ఆదివారం పర్యవేక్షించారు. సీఎం పర్యటన ఇన్చార్జి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, డీసీసీబీ డైరక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి కూడా సభ ఏర్పాట్లను పరిశీలించారు. సభ ముగిసేంత వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలో చోటుచేసుకోకుండా సుమారు 1,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ రేంజ్ ఐజీ షాహనవాజ్ ఖాన్, జోగుళాంబ గద్వాల జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ సృజనతోపాటు పోలీసు ఉన్నతాధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
నడిగడ్డలో కేసీఆర్ మార్క్..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జోగుళాంబ గద్వాల జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపారు. రూ.వందల కోట్లు వెచ్చింది పలు అభివృద్ధి పనులు చేపట్టి జిల్లా రూపురేఖలే మార్చేశారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చొరవతో ఎన్నో ఏండ్ల ఆర్వోబీ కలను నెరవేర్చి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టారు. 2018లో రెండు స్థానాలను క్లీన్‌స్వీప్ చేయడంతో బీఆర్ఎస్కు ఎదురులేకుండాపోయింది. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రగతిని పట్టాల మీదకెక్కించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నిధులు విడుదల చేశారు. దీంతో జిల్లాకేంద్రంలో రూ.6.5కోట్లతో ఇండోర్ స్టేడియం, 1300 డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మించారు. ఇంటిగ్రేడ్ మార్కెట్ కోసం రూ.18కోట్లు వెచ్చిస్తున్నారు. రూ.నాలుగు కోట్లతో బస్టాండ్, పీజీ కాలేజ్‌లో హాస్టల్ భవనానికి రూ.10కోట్లు మంజూరు చేశారు. రూ.11.90కోట్లతో సెంట్రల్ లైటింగ్‌తోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు వెచ్చించారు.
ఇదివరకే జిల్లాకు నర్సింగ్ కళాశాలను మంజూరు చేయగా మెడికల్ కళాశాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లా ప్రజల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. మెడికల్ కాలేజీ వస్తే దానికి అనుబంధంగా 500 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను కార్పొరేట్ స్థాయిలో నిర్మించుకోవచ్చు. అనారోగ్య సమస్యలతో బాధపడే వారు కర్నూల్‌కు వెళ్లకుండా ఇక్కడే వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణానికి స్థల సేకరణ పూర్తికాగా, నర్సింగ్ కళాశాల నిర్మాణం సాగుతున్నది. రూ.581కోట్లతో గట్టు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టగా.. తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులు పూర్తి చేసుకొని సాగునీరు అందిస్తున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద కాలువలు, రిజర్వాయర్లను స్థిరీకరించి సాగునీటిని విడుదల చేస్తున్నారు. తెలంగాణ వచ్చాక గత ప్రభుత్వాల పాపాలను కడిగి.. నడిగడ్డ స్వరూపాన్నే మార్చారు. జూరాల ప్రాజెక్టు వద్ద రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేపట్టి అధికారులు కొత్త రికార్డు సృష్టించారు.
Brsmeeting
సీఎం కేసీఆర్ పర్యటన ఇలా..
సీఎం కేసీఆర్ సోమవారం సాయంత్రం ప్రగతిభవన్ నుంచి బేగంపేటకు.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గద్వాల కు బయలుదేరుతారు. సమీకృత కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో ల్యాండ్ అయ్యాక.. అక్కడి నుంచి నేరుగా ప్ర త్యేక బస్సులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ముందుగా అయిజ రహదారిలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి చేరుకొని రూ.38కోట్ల తో నిర్మించిన పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ను హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, డీజీపీ అంజనీకుమార్‌తో కలిసి ప్రారంభిస్తారు. అనంతరం రూ. 52కోట్లతో నిర్మించిన కొత్త సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభిం చి అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో సమావేశమవుతా రు. అక్కడి నుంచి నేరుగా బహిరంగ సభ వేదికను చేరుకుని.. సభ ముగిశాక హెలిప్యాడ్‌కు చేరుకొని హైదరాబాద్‌కు
బయలుదేరుతారు.
ఎస్పీ కార్యాలయ నిర్మాణం..
పీజేపీ ఆవరణలో సమీకృత జిల్లా పోలీస్ కార్యాలయ సముదాయం రూ.38.50 కోట్లతో నిర్మించారు. కార్యాలయంలో సిబ్బంది విధులు నిర్వహించేందుకు నాలుగు ఫోర్లు, 45 గదులు, సమీక్ష సమావేశాల కోసం కాన్ఫరెన్స్‌హాల్, ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేశారు. సాయుధ దళపతి కార్యాలయంతోపాటు ఆర్మ్డ్ సిబ్బంది ఉండేలా రెండు బరాక్‌లు నిర్మించారు. ల్యాబ్ సౌకర్యం, ఫోరెన్సిక్, సైబర్, క్లూస్‌టీం కోసం వసతులు కల్పించారు. డాగ్, బాంబ్ స్కాడ్ సిబ్బందికి వసతి ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్ కార్యాలయం..
అయిజ రహదారిలో మార్కెట్ యార్డు స్థలంలో బీఆర్ఎస్ భవనం నిర్మించారు. అందులో ముఖ్యకార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి హాల్‌తోపాటు నాయకులతో సమావేశాలు నిర్వహించుకోవడానికి రెండు గదులు ఏర్పాటు చేశారు. ఒకే సారి సుమారు వెయ్యి మంది కార్యకర్తలతో సమావేశం నిర్వహించేలా ప్రత్యేక హాల్ నిర్మించారు. సోమవారం ఈ కార్యాలయాలను ప్రగతి ప్రదాత, సీఎం కేసీఆర్ ప్రారంభించి అందుబాటులోకి తెస్తుండడంతో నడిగడ్డ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భారీ బందోబస్తు
సీఎం గద్వాల పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ రేంజ్ ఐజీ, జోగుళాంబ గద్వాల జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ నేతృత్వంలో 1500మందితో భారీ బందోబస్తుకు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ సృజన వెల్లడించారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో డాగ్స్వాడ్ తనిఖీలు చేపట్టారు.
సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం ఇలా..
జిల్లా కేంద్రంలోని పీజేపీ క్యాంపు కార్యాలయ ఆవరణలో కలెక్టరేట్ నిర్మాణంతోపాటు వారి క్యాంపు కార్యాలయాలు, నివాస గృహాలు, ఎస్పీ కార్యాలయం, క్యాంపు కార్యాలయం, వారి నివాస గృహాల కోసం 21 ఎకరాలను సేకరించారు. ఇందులో కలెక్టరేట్ భవనాన్ని రూ.51.18 కోట్లతో మూడు అంతస్తుల్లో వివిధ శాఖలకు చెందిన 36 జిల్లా స్థాయి కార్యాలయాలను నిర్మించారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయం 1.39 లక్షల చదరపు మీటర్లలో 46 గదులతో ఏర్పాటైంది. కలెక్టర్ చాంబర్‌తోపాటు అదనపు కలెక్టర్ల చాంబర్లు, వీడియో కాన్ఫరెన్స్హాల్తో పాటు విశ్రాంతి హాల్ నిర్మించారు. మొదటి, రెండో అంతస్తులో జిల్లా అధికారుల కార్యాలయాలు, సమీపంలోనే ముఖ్య అధికారులు ఉండేలా ఎనిమిది నివాస భవనాలు నిర్మించారు. కార్యాలయ ఆవరణలోని గార్డెనింగ్, కాకతీయుల కాలం నాటి స్తంభాలను కలెక్టరేట్ ముందు భాగంలో నిర్మించడంతో ప్రత్యేక శోభ సంతరించుకున్నది.
గ్రౌండ్‌ఫ్లోర్‌లో : కలెక్టర్ చాంబర్‌తోపాటు జిల్లా పౌరసంబంధాల శాఖ, కోశాధికారి, స్ట్రాంగ్ గది, జిల్లా శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ వెల్ఫేర్, వికలాంగుల, వృద్ధుల, ట్రాన్స్‌జెండర్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు.
మొదటి అంతస్తులో : జిల్లా వ్యవసాయశాఖ, ఆత్మ, ఉద్యానవన, పట్టుపరిశ్రమ, మత్స్యశాఖ, ముఖ్యప్రణాళిక, భూగర్భ జల, బీసీ, ఎస్సీ ఎస్టీ, మైనార్టీ, సహకార, ఇంటర్మీడియట్, జిల్లా విద్యాశాఖ, జిల్లా పంచాయతీ, మిషన్ భగీరథ (ఇంట్రా, వాటర్‌గ్రిడ్), చేనేత, జౌళి శాఖ, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య, వైద్యశాఖ కార్యాలయాలు.
రెండో అంతస్తులో : మార్కెటింగ్, లీగల్ మెట్రాలజీ, ఆడిట్, స్పెషల్ డి ప్యూటీ కలెక్టర్ (భూసేకరణ) నీటిపారుదల, రోడ్లు భవనాలు, ఎక్సైజ్, అటవీ, పరిశ్రమల, కార్మిక, భూగర్భ గనుల శాఖ కార్యాలయాలకు కేటాయించారు. అధికారుల పనితీరు పర్యవేక్షించడానికి సమీకృత కలెక్టర్ కార్యాలయంలో సీసీ కెమెరాలు అమర్చారు. ప్రజలకు పారదర్శకమైన మెరుగైన పాలన అందించడానికి ఈ సమీకృత కలెక్టరేట్ భవనాలు ఎంతగానో ఉపయోగ పడుతాయని అధికారులతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.