ఎక్కడ చూసినా గులాబీ ప్రభంజనమే.. అభిమానం ఉవ్వెత్తున ఎగిసింది.. జన ప్రవాహం కదిలింది.. వేలాదిగా జనం, బీఆర్ఎస్ శ్రేణులు కదలగా.. జన సునామీని తలపించింది.. అభిమాన నేత, ప్రగతి ప్రదాతను కేసీఆర్‌ను చూసేందుకు ఉప్పెనలా కదిలివచ్చారు. గులాబీ జెండాలు చేతబట్టి,మేడలో కండువాలతో జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. బ్యాండ్ మేళాల మధ్య ర్యాలీలు, డ్యాన్స్‌లతో సందడి చేశారు.
బైక్ ర్యాలీలు, పాదయాత్రలతో చిన్నా, పెద్ద తేడా లేకుండా దారులన్నీ దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట సభల వైపే సాగాయి. నాలుగు చోట్ల సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు జాన జాతరను తలపించాయి. సభా ప్రాంగణాలు కిక్కిరిసిపోవడంతో చెట్లు, పుట్టలు, మిద్దెలు సైతం సరిపోలేదు. ప్రమాదాన్ని సైతం లెక్క చేయకుండా ఆతృతతో ప్రజలు ఎగబాకారు. ఆలస్యమైనా తమ అభిమాన నేత కేసీఆర్ రాక కోసం ఎదురుచూశారు. అభివృద్ధిని వివరిస్తూ.. ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తుండగా జనం జేజేలు పలికారు.