మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ నాగర్‌కర్నూల్, (నమస్తే తెలంగాణ), జూన్ 6 ;‘మాట ఇస్తున్నాం.. మార్చి చూపిస్తాం.. ఉమ్మడి పాలమూరు జిల్లాను బంగారు తునకగా తీర్చిదిద్దుతాం.. తెలంగాణ ఏర్పాటుతో కొత్త జిల్లాలు, కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు వచ్చినయ్.. ఒక్క పాలమూరులోనే ఐదు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వస్తాయని ఏనాడైనా కలగన్నామా’..? అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్, పోలీసు భవన సముదాయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను మంగళవారం సీఎం ప్రారంభించారు. ఐడీవోసీ కార్యాలయంలో ఉద్యోగులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభలో లక్షకుపైగా హాజరైన జనాలనుద్దేశించి మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరులో అద్భుతాలు చేశామన్నారు. ఐటీ రంగంలో తెలంగాణకు ఎవరూ సాటిలేరన్నారు. నాడు గంజి కేంద్రాలుంటే.. నేడు ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు వచ్చాయన్నారు. గతంలో పాలమూరు పల్లెలకు క్లింటన్‌ను తీసుకొచ్చి, దత్తత తీసుకొన్నోళ్లు కనీసం తాగునీళ్లు కూడా ఇయ్యలేదని విమర్శించారు. వచ్చే ఆగస్టు నాటికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నిర్మించిన రిజర్వాయర్లను కృష్ణమ్మతో నింపుతామని వెల్లడించారు. వంద శాతం నీటి సమస్య లేకుండా చేస్తా.. ఇంకా నెరవేరుస్తా.. అంటూ పాలమూరుపై తన మమకారాన్ని సీఎం కేసీఆర్ మరోసారి చాటుకున్నారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి పాలమూరు పచ్చబడ్డది.. వందశాతం నీళ్లిచ్చి మీ రుణం తీర్చుకుంటానని సీఎం కేసీఆర్ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్, పోలీసు భవన సముదాయం, బీఆర్ఎస్ కార్యాలయాల ప్రారంభోత్సవాలను చేసిన అనంతరం ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో లక్షకుపైగా హాజరైన జన సందోహాన్ని ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటుతో నాగర్‌కర్నూల్ జిల్లాగా ఏర్పడింది. జిల్లాలో చాలా చక్కటి కలెక్టరేట్, పోలీసు కార్యాలయం నిర్మించుకొని, నా చేతుల మీదుగా ప్రారంభించేలా చేసిన ప్రజలందరికీ హృ దయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్న. తెలంగాణ రా కుంటే జిల్లా అయ్యేది కాదు, కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసు అయ్యేది కాదు. ఈ భవనాల వద్ద సెల్ఫీలు తీసుకంటున్నారని హైదరాబాద్ వరకూ తెలిసింది. తెలంగాణ ఉద్యమం, సాధనకు ఓ చరిత్ర ఉంది.
పాలమూరును చూస్తే కండ్లలో నీళ్లు తిరిగినయ్..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా వెనుకబాటుతనం, ఇబ్బందులు, సాగు, తాగునీళ్లకు ప్రజలు అరిగోస పడుతున్నరు. పూర్తిగా అర్థం కావాలంటే పాలమూరు ఎంపీగా ఉంటే ఎట్లుంటదని, ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ని అడిగితే, అక్కడ పోటీ చేస్తే కష్టనష్టాలు తెలుస్తాయని చెప్పారు. నాడు ఉద్యమం బలంగా లేకుండె. మీ అద్భుతమైన ప్రేమతో ఎంపీగా గెలిపించారు. పాలమూరు జిల్లా పేరు తెలంగాణ ఉద్యమ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. సాధించుకున్న రాష్ట్రంలో పదో సంవత్సరంలోకి అడుగు పెట్టాం. పాలమూరు ఒకనాడు బొంబాయి బస్సులకు ఆలవాలం. పార్టీలు పోటీపడి కరువు అని చెప్పి గంజి కేంద్రాలు పెట్టేవి. అవి పేపర్లలో వార్తలు చదివితే మా కండ్లల్లో రక్తం వచ్చేది. పాలుగారిన పాలమూరులో ఈ గంజికేంద్రాలు ఏంటి, ఈ దుస్థితి ఎప్పుడు పోతదని బాధపడేవాళ్లం. ఇప్పుడు గంజి కేంద్రాలు మాయమైనవి. ఊరూరా పంటలు కొనుగోలు చేసే కేంద్రాలు వచ్చినయ్.. ఇది బీఆర్ఎస్ పార్టీ చేసిన పని.
ఇంతకుముందు కేసీఆర్ కంటే చాలా మంది దొడ్డుగా ఉన్నోళ్లు మంత్రులుగా చేసిండ్రు. కాంగ్రెస్ 50,60ఏండ్లు, బీజేపీ,టీడీపీ పాలించినయ్, సీఎంలు దత్తత తీసుకున్నరు, మంచినీళ్లు ఇయ్యలేదు. ప్లాస్టిక్ బిందెలను పట్టుకొని ఆడబిడ్డలు బాధపడ్డరు. ఇప్పుడు మిషన్ భగీరథతో ఇంటింట్లో కృష్ణమ్మ నీళ్ల్లు వస్తున్నయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 5మెడికల్ కాలేజీలు ఏర్పాటైనయి. ఎప్పుడన్నా జీవితంలో అనుకున్నమా. ఇంక ఏ ఒక్కడు మెడికల్ కాలేజీ ఎందుకు తే లేదు. మంచినీళ్లు ఇయ్యలే, కరెంట్ ఇయ్యలేదు. పాలమూరు అ నంగనే బిల్ క్లింటన్‌ను కల్వకుర్తి తండాల్లోకి, ప్రపంచ బ్యాంక్‌ను పల్లెల్లోకి తీసుకొచ్చి చూపించిండ్రు.
కాకతీయ రెడ్డిరాజులు 75వేల చెరువులు కుంటలు తవ్విస్తే, సమైక్య రాష్ట్రంలో మాయం జేసిండ్రు. మిషన్ కాకతీయతో పాలెం, వడ్డెమాన్ చెరువులు ఏ విధంగా ఉండె, కంపతారు చెట్లతో, లొట్టపీసు చెట్లతో ఉండె. తాంబాలం లెక్క తయారై ఉండె. కేసరి సముద్రం గతంలో ఇంకిపోయి, గందరగోళంగా ఉండె. క్రికెట్ మైదానంలా, కంపతారు చెట్లతో ఉండె. ఇప్పుడు సుందరంగా తయారైంది. శాంతిదేవుడు గౌతముడు కూడా వెలిసిండు. పర్యాటక ప్రాంతంగా మారిందంటే తెలంగాణ ప్రభుత్వ ఘనత. దుందుభీ వాగుపై గోరటి పాట రాసిండు, వాగు ఎండిపాయెరా.. పెదవాగు ఎండిపాయెరా.. పేగు ఎండిపాయెరా అని ఆనాడు తన గానంలో దుఃఖపడిండు. ఇప్పుడు వాగు నిండిపారెరా అని కడుపునిండుతుందని పాడుతుండు. దుందుభీపై 10,12చెక్ డ్యాంలలో వానకాలం రాకముందే నీళ్లు నిలబడున్నయ్. నా కండ్లల్లో ఆనంద భాష్పాలు వచ్చినయ్. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా పెండింగ్‌లో ఉండె. తెలంగాణ రాకుంటే ఇయ్యాల కూడా ముందల పడకుండె.
ప్రభుత్వం, స్థానిక నాయకుల చొరవతో 20లక్షల ఎకరాలకు సాగునీరు అందించే దిశగా ముందుకు పోతున్నం. అచ్చంపేట ప్రాంతానికి రూ.2వేల కోట్లతో ఉమామహేశ్వర లిఫ్టును ప్రారంభించుకుంటున్నం. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి బస్సులో 200కిలో మీటర్లు పోతుంటే పంటలతో ఎంతో పాలమూరుకు ఒడిశా, బిహార్, జార్ఖండ్ నుంచి నాట్లేసేందుకు వలస వస్తుండటం గర్వకారణం. భూముల ధరలు ఎకరం10-15వేలకు అమ్ముకుంటే.. నేడు రూ.2కోట్లకు చేరుకొంది. కలెక్టరేట్ వద్ద నాలుగు కోట్లకు తక్కువ లేదు. పాలమూరు గ్రామాల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బొడ్రాయి పండుగలు చేసుకుంటున్నరంటే సంతోషంగున్నది. నడిగడ్డకు పోయినప్పుడు గతంలో పరిస్థితులు చూసి నేను ఏడ్చిన. పాలమూరులో ఇంత అభివృద్ధి జరగడం సంతోషం కలిగిస్తుంది. గృహలక్ష్మి పథకం ద్వారా పాలమూరు జిల్లాలో నియోజకవర్గానికి 4వేల ఇండ్లు అందజేస్తాం. బీసీ చేతివృత్తుల కులాలకు కుటుంబానికి రూ.లక్ష చొప్పున సాయం ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. పాలమూకు కండ్ల నీళ్లను తుడిచిన అన్న సంతోషం నా గుండెల్లో ఉంది. పాలమూరు ఎత్తిపోతల పథకం నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్ధండాపూర్ 75-80టీఎంసీల రిజర్వాయర్లు ఒకసారి నిండిదే నా పాలమూరు బంగారు తునక. ఆగస్టు మాసంలో రిజర్వాయర్లు నింపుతాం. పాలమూరులో నీటి సమస్య లేకుండా వందశాతం ప్రయత్నం చేస్తా, నెరవేరుస్తా అని మాట ఇస్తున్నానని అన్నారు.
తుపాకీ గుండు మర్రి..
నాగర్‌కర్నూల్ కాలేజీది ప్రత్యక చరిత్ర. దశల వారీగా చేద్దామని ముందు మహబూబ్‌నగర్, తర్వాత వనపర్తికి సాంక్షన్ చేసినం. వెంటనే తుపాకీ గుండులా వచ్చిండు మీ జనార్దన్ రెడ్డి. నామీద అలిగి కూసున్నడు. మాట్లాడిస్తే మాట్లాడడు.. సప్పుడు చే యడు. మొఖం ముడేసి కూసున్నడు. ఏందయ్య నీ గొడవ అనడిగితే.. నాగర్‌కర్నూల్‌కు మెడికల్ కాలేజీ ఇయ్యాలె.. లేకుంటే మీ ఇంట్లనే ఉంటానని పంచాయతీ పెట్టిండు. అప్పుడున్న ఆ రోగ్య మంత్రి, సెక్రటరీతో మాట్లాడి నాగర్‌కర్నూల్‌కు మెడికల్ కాలేజీ ఇయ్యాలని చెప్పిన. మర్రి మామూలు మనిషి కాదు.. పట్టుబట్టిండంటే సాధించి తీరుతడు అని సీఎం అన్నారు.
విజయవంతమైన సభ..
సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవాల అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. గ్రామాలు, పట్టణాల నుంచి లక్ష మందికిపైగా జనం తరలివచ్చారు. ట్రాక్టర్లు, ఆటోలు, డీసీఎం ఇతర వాహనాల్లో జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. సాయంత్రం 7గంటలకు సీఎం కేసీఆర్ ప్రసంగించి, ముగించే వరకు ప్రజలు ఆసక్తితో విన్నారు. ఈలలు, కేరింతలతో చప్పట్లు కొట్టారు. చప్పట్లతో హర్షధ్వానాలు ప్రకటించారు. పాలమూరు అభివృద్ధిపై పాడిన పాటకు చప్పట్లతో సంతోషం ప్రకటించారు. ఇక స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి మెడికల్ కాలేజీ కోసం పడిన తపన నాగర్‌కర్నూల్ ప్రజలు, మర్రి అభిమానులను సంతోషపర్చింది.