Narayanapet | ఊట్కూర్, ఏప్రిల్ 16 : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని అమీన్పూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేకపోవడంతో వరండాలో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. స్థానిక పాఠశాలలో 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు విద్యా బోధన చేపట్టేందుకు ఐదుగురు రెగ్యులర్ ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ విద్యాభ్యాసనకు మాత్రం తరగతి గదులు సరిపడక ఒక్కో గదిలో రెండు క్లాసులను నిర్వహిస్తున్నారు. పాఠశాలలో మొత్తం నాలుగు తరగతి గదులను నిర్మించగా ఓ గదిలో బీరువా, అల్మారాలను అడ్డంగా ఉంచి హెడ్మాస్టర్, ఉపాధ్యాయుల విడిది కోసం వినియోగిస్తూ మిగిలిన సగభాగాన్ని 2వ తరగతి విద్యార్థులకు కేటాయించారు. పక్కనే ఉన్న మరో గదిలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ కొనసాగుతోంది.
ఈ క్రమంలో పై అంతస్తులో నిర్మించిన మరో రెండు గదుల్లో ఓ గదిలో 4, 5వ తరగతులు, మరో గదిలో 6, 7 తరగతులు కొనసాగుతున్నాయి. కాగా 1, 3వ తరగతి విద్యార్థులకు విద్యాభ్యాసం కోసం గదులు లేకపోవడంతో పై అంతస్తులో ఉన్న వరండాలో విద్యార్థులను పక్కపక్కనే కూర్చోబెట్టి ఉపాధ్యాయులు విద్యాభ్యాసం చేయిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు తరగతి గదులు సరిపోక, కూర్చునేందుకు సరిపడా స్థలం లేక సతమతమవుతున్నారు. మరోపక్క ఉపాధ్యాయులకు సైతం వరండాలో పాఠాలు బోధించేందుకు కష్టతరమవుతోంది. ఒక్కో గదిలో రెండు తరగతులను నిర్వహిస్తుండడంతో విద్యార్థులు చదువుపై ఏకాగ్రతను కోల్పోతున్నారని తల్లిదండ్రులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విక్టర్ పాల్ మాట్లాడుతూ.. పాఠశాల ప్రాంగణంలో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణం పనులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో విద్యార్థులకు తరగతి గదుల సమస్య ఏర్పడిందన్నారు. వరండాతో పాటు ఒక్కో గదిలో రెండు తరగతుల నిర్వహణ ఉపాధ్యాయులకు కష్టంగా ఉందని, విద్యార్థులను ఒకే చోట కూర్చోబెట్టడంతో బోధనలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. గదుల సమస్యను జిల్లా విద్యాశాఖ దృష్టికి తీసుకుపోయామని, అసంపూర్తిగా ఉన్న గదుల నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయిస్తే విద్యార్థులకు సమస్య తీరుతుందని తెలిపారు.