దేవరకద్ర, జనవరి 4 : మండలంలోని ఆయా గ్రామాల్లో నిర్మాణం చేపట్టిన చెక్ డ్యాంలు నిండుకుండలా మారాయి. బండర్‌పల్లి వాగులో చెక్ డ్యాంలు నిర్మాణం చేపట్టడంతో గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగి బోరుబావులో నీరు సమృద్ధిగా లభిస్తున్నది. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న ఉకచెట్టువాగులో పెద్దరాజమూర్, చిన్నరామూర్, బస్వాపూర్, గూరకొండ, గుడిబండ తదితర గ్రామాల్లోని వాగులో చెక్‌డ్యాంలు నిర్మాణం చేయడంతో వాగులో పూర్తిస్థాయిలో నీరు నిలిచి ఉన్నది. ఆయా ప్రాంతాల్లో 60 నుంచి 90 మీటర్ల పొడవుతో వాగులో అడ్డుకట్ట నిర్మించారు.
అదేవిధంగా చెక్‌డ్యాంల వద్ద వాగుకు ఇరువైపులా కోతకు గురికాకుండా బండరాళ్లతో రివిట్మెంట్ కట్టించారు. చెక్‌డ్యాంలో నీరు నిల్వ ఉండడంతో మత్స్యకారులు చెక్‌డ్యాంలో చేపపిల్లలను వదిలి జీవనోపాధి పొందుతున్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి బండర్‌పల్లి వాగులో చెక్‌డ్యాంలు నిర్మాణం చేయడంతో ఏడాది పొడవునా నీరు నిలిచిఉండటంతో భూగర్బజాలలు పెరిగిపోతున్నాయి. వాగు పక్కనున్న పొలాలకు సాగు నీరు పారించేందుకు అవకాశం కల్పించారు. ఈ ఏడాది వానలు సమృద్ధిగా కురవడంతో మండలంలోని అన్ని గ్రామాల్లోని చెరువులు నీటితో జలకల సంతరించుకున్నాయి.
పుష్కలంగా భూగర్భజలాలు
బండర్‌పల్లి వాగులో చెక్‌డ్యాంలు నిర్మించడంతో సమీప గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగాయి. దీంతో సమీప గ్రామాల రైతుల బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉండటంతో రైతులు వరి పంటలతోపాటు ఆరుతడి పంటలను సాగుచేసుకుంటున్నారు.
– తిరుపతయ్య, రైతు
ఏడాది పొడవునా నీరు
వాగులో చెక్‌డ్యాంలు ఏర్పాటు చేయడంతో ఏడాది పొడవునా నీరు ఉంటున్నది. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ముందుజాగ్రత్తతో వాగులో నిర్మించిన చెక్‌డ్యాంలతో రైతులతోపాటు మత్స్యకారులకు ఎంతో ఉపయోగపడుతుంది.
– గోవిందు, రైతు