పెబ్బేరు, జనవరి 20: భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా మున్సిపాలిటీ కేంద్రంలో వెలిసిన చౌడేశ్వరీదేవి ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. నాలుగు రోజులపాటు జరిగే అమ్మవారి ఉత్సవాలకు పట్టణంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు తెలిపారు.
ఆలయ చరిత్ర
పూర్వం పెబ్బేరుకు చెందిన యాదవులు గొర్రెల మేపుల కోసం ప్రస్తుత అడ్డాకుల మండలం గుడిబండ గ్రామానికి వెళ్లేవారు. ఒక రోజు గొర్రెల కాపరి కలలో బాలిక రూపంలో వచ్చిన అమ్మ వారు తాను బండ రాతిలో పుట్టిన బంగారు చౌడమ్మనని ఇక్కడ ఎవరూ పూజించడం లేదని మీ వెంట తీసుకువెళ్లాలని కోరినట్లు కథనం. గొర్రెల కాపరి విషయా న్ని గ్రామంలోని కుల పెద్దలకు వివరించడంతో వారంతా గుడిబండ గ్రామానికి వెళ్లి బండ రాళ్ల మధ్య ఉన్న అమ్మవారి విగ్రహాన్ని పల్లకీలో తెచ్చి గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయం సమీపంలో చిన్న గుడి నిర్మించి ప్రతిష్టించి పూ జించి, 5 సంవత్సరాలకోసారి ఉత్సవాలు నిర్వహించే వారని ప్రతీతి. కాలక్రమేణా అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేసిన యాదవులు 15సంవత్సరాల నుంచి ప్రతి ఏటా చౌడేశ్వరీ దేవి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టించడం వల్లే పంటలు బాగా పండి సిరిసంపదలు పెరిగాయని ఇక్కడి భక్తుల నమ్మకం.
ఉత్సవాల వివరాలు
నాలుగు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలు శనివారం రాత్రి 7గంటలకు వేణుగోపాలస్వామి పల్లకీ సేవతో ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 22న ఉదయం చౌడేశ్వరీదేవి ఉత్సవ విగ్రహానికి మహాభూ పాల్ సముద్రంలో గంగాస్నానం, రాత్రి 11గంటల నుంచి తెల్లవారు జాము వరకు అమ్మవారికి పల్లకీ సేవ, జ్యోతుల ఊరేగింపు నిర్వహించి ఆలయంలో ప్రతిష్టిస్తారు. 23 నుంచి 24వరకు భక్తులకు అమ్మవారి దర్శనం ఉంటుందని తెలిపారు.
ఏర్పాట్లు పూర్తి
చౌడేశ్వరీ దేవి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. స్థానిక సుభాష్ చంద్రబోస్ చౌరస్తాలో అమ్మవారు ప్రతిభింబించేలా విద్యుద్దీపాలతో కటౌట్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఆలయం వరకు వనపర్తి రోడ్డుకిరువైపులా రంగురంగుల విద్యుత్‌దీపాలతో ముస్తాబు చేశారు. పిల్లల కోసం పట్టణంలోని ఎగ్జిబిషన్ ఏర్పాట్లు చేశా రు. రోడ్డుకు ఇరువైపులా తినుబండారాలు, ఆటవస్తువుల దుకాణానాలు వెలిశాయి. భక్తులు క్రమశిక్షణతో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవాలన్నారు.