
మహబూబ్‌నగర్, డిసెంబర్ 30 : పంటసాగు పెట్టుబడికి ప్రభుత్వం రైతులకు అందించే రైతుబంధు డబ్బులను ఇతర రుణాలకు జమ చేసుకోవద్దని కలెక్టర్ వెంకట్రావు బ్యాంకర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని రెవె న్యూ సమావేశమందిరం నుంచి బ్యాంకర్లతోపాటు వ్యవసాయాధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 2లక్షల 2వేలమంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.220కోట్లు జమ చేయనున్నదని తెలిపారు. ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమచేసే రైతుబంధు డబ్బులను ఇతర రుణాలకు మళ్లించవద్దన్నారు. అలాగే బ్యాంకులకు వచ్చే రైతులకు అవసరమైన స దుపాయాలు కల్పించాలని సూచించారు. కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకొని రైతులకు మాస్కులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. వీసీలో ఎల్డీఎం నాగరాజు, జేడీఏ సుచరిత తదితరులు పాల్గొన్నారు.
కేర్ ఇండియా సేవలు మరవలేనివి..
కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న సమయంలో కేర్ ఇండి యా సంస్థ అందించిన సేవలు మరువలేనివని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో కేర్ ఇండియా సంస్థ అందిస్తున్న సేవలు ఈనెలాఖరుతో ముగియనున్న సందర్భంగా గురువారం కేర్ ఇండి యా ప్రతినిధులతో కలెక్టర్ వీసీలో మాట్లాడారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, జిల్లా యంత్రాంగం తరఫున కేర్ ఇండియా సంస్థ ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఏడాది కొవిడ్ విభాగంలో పేషెంట్ కేర్, ఫిజియోథెరపీ, ల్యాబ్ టెక్నీషియన్ వంటి ఎన్నో సేవలు అందించినట్లు తెలిపారు. అయితే కేర్ ఇండియా ప్రాజెక్టుకు ఇచ్చే నిధులకు సంబంధించి 20 శాతం నిధులు ఇచ్చేందుకు సు ముఖంగా ఉన్నామని, మిగతా నిధులను సీఎస్ఆర్ నిధులు, కేర్ ఇండియా సొంత నిధులను సమకూర్చుకొని సేవలు అందించాలని కలెక్టర్ కోరారు. వీసీలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, డీఎంహెచ్‌వో కృష్ణ, డాక్టర్ రాంకిషన్ తదితరులు ఉన్నారు.