మక్తల్ టౌన్ జనవరి 5: బోధనోపకరణలతో విద్యార్థిలో అవగాహన కల్పించడమే తొలిమెట్టు ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా గురువారం మక్తల్ మండలంలో49 పాఠశాలలకు సంబంధించిన అధ్యాపకులకు పట్టణంలోని కన్యాకాపరమేశ్వరి కల్యాణ మండపంలో, ఏర్పాటు చేసిన ఎఫ్ఎల్ఎన్, టీఎల్ఎం మేళాకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ఉపాధ్యాయులు తయారు చేసిన టీఎల్ఎంలను పరిశీలించారు. ఆసక్తిగా ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అంతకుముందు జెడ్పీ చైర్మ న్ వనజ, డీసీసీబీ చైర్మన్ చిట్యాల నిజాంపాషా టీ ఎల్ ఎం మేళాను ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథిగా వచ్చిన రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ మక్తల్ మండలంలోని 49 పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయులు తెలుగు, గణితం, ఆంగ్లం విషయాల్లో 621 ప్రదర్శనలను తయారు చేయడం ఆనందదాయకమన్నారు. ఉపాధ్యాయులను దేవుళ్లతో సమానంగా భావించడం వల్లనే సమాజంలో అందరికీ విద్య అందుతుందన్నారు. మక్తల్ మండలంలోని అధ్యాపకులు విద్యార్థులకు సరళంగా మైండ్లో నిలిచే రీతిలో కష్టపడి, టీఎల్ఎం తయారు చేయడం వారి మేధో శక్తికి నిదర్శనమన్నారు.
మక్తల్ ప్రాంతంలో ప్రత్యేకంగా విద్య, వ్యవసాయంపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల నేడు ఈ రెండు రంగాల్లో నియోజకవర్గం ముందంజలో ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విద్యావ్యవస్థ రాష్ట్రంలో అభివృద్ధి చెందిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో చెట్ల కింద చదువులే ఉండేవన్నారు. విద్యావ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రెసిడెన్సియల్, గురుకులాలు, కేజీబీవీల అభివృద్ధితోపాటు, మన ఊరు -మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించిందన్నారు.
మన ఊరు – మనబడి కార్యక్రమంలో మక్తల్ మండలంలో 21 పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. మేళాలో చక్కటి రీతిలో బోధనోపకరణలను తయారు చేసిన ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. టీఎంఎల్ తయారీలో సబ్జెక్టుల వారీగా ప్రథములుగా నిలిచిన వారికి ఎమ్మెల్యే మెమెంటో, ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఎంఈవో లక్ష్మీనారాయణ కాంప్లెక్స్ హెచ్ఎంలు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మక్తల్ మండలంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, అన్ని పా ఠశాలల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు పాల్గొన్నారు.