Leopard | మరికల్, ఏప్రిల్ 02 : మరికల్ మండలంలో జనవరి నుంచి ప్రతి నెల ఏదో ఒక చోట చిరుత పశువులపై దాడులు చేస్తూనే ఉంది. దీంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జనవరి 29న మండలంలోని జిన్నారం గ్రామానికి చెందిన రైతు మేకలపై చిరుత దాడి చేయడంతో మేకలు మృతి చెందాయి. ఫిబ్రవరి 3న పూసలపాడు గ్రామానికి చెందిన గొల్ల నరసింహులు పెంచుకుంటున్న గేదెపై చిరుత దాడి చేసింది. మార్చి 15న ధన్వాడ మండల కేంద్రానికి చెందిన ఓ రైతుకు సంబంధించిన గేదపై చిరుత దాడి చేయడంతో గేదె మృతి చెందింది.
మంగళవారం రాత్రి మరికల్ మండలంలోని మాధవరం గ్రామానికి చెందిన రైతు కురువ వెంకటేష్ గేదెపై చిరుత దాడి చేయడంతో గేద మృతి చెందింది. గత మూడు నెలల నుంచి వరుసగా చిరుత పులి దాడి చేస్తున్నాడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని మండలంలోని రైతులు కోరుతున్నారు.
ఈ సందర్భంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మల్లేష్ మాట్లాడుతూ.. చిరుతల సంచారం నేపథ్యంలో పశువులను తమ నివాసాల వద్దే కట్టేసుకోవాలని సూచించారు. రైతులు ఎవరూ కూడా చిరుత పై దాడి చేయరాదని, ఒకవేళ దాడి చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిరుత దాడిలో మృతి చెందిన పశువులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని తెలిపారు.