జోగులాంబ గద్వాల్ : జిల్లా కేంద్రంలో ఓ మహిళను కత్తితో పొడిచి దారుణంగా హత్య ( Murder ) చేసిన ఘటన కలకలం రేపింది. కుటుంబ సభ్యులు, స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటనలో నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.
జోగులాంబ గద్వాల్ ( Jogulamba Gadwal ) జిల్లా గద్వాల్ పట్టణంలోని బీసీ హాస్టల్ సమీపంలో నివాసముంటున్న శంకరమ్మ (59)ను ఆమె ఇంట్లోనే సమీప బంధువైన మేకల రామంజి కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. తీవ్ర గాయాలపాలైన శంకరమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, నిందితుడు మేకల రామంజి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. బంధువుల మధ్య జరిగిన స్వల్ప వాగ్వాదమే ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. .
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి హత్యకు గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.