అయిజ, డిసెంబర్ 20 : తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు, పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించి ఫార్ములా ఈ – రేస్ నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌పై కక్ష పూరితంగా వ్యవహరిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి కేటీఆర్‌పై అక్రమంగా కేసు నమోదు చేయించారని బీఆర్ఎస్వీ జిల్లా నేత కుర్వ పల్లయ్య ఆరోపించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఆదేశాల మేరకు శుక్రవారం అయిజ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్వీ నాయకులు శాంతియుతంగా నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా కుర్వ పల్లయ్య మాట్లాడుతూ ఫార్ములా ఈ – రేస్‌లో కేటీఆర్ తప్పు లేకపోయినా కాం గ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసు నమోదు చేయడం చూస్తుంటే కేటీఆర్‌ను ఎదుర్కోలేక ఏసీబీతో కుట్రలు పన్ని కేసుల్లో ఇరికించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అడ్డదారులు వెతుక్కొని కుట్రలకు తెరలేపాడని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని, రేవంత్‌రెడ్డి కుంభకోణాలను ఎప్పటికప్పుడు వెలికి తీస్తుండడంతో డైవర్సన్ పాలిటీక్స్ చేస్తూ కాలయాపన చేసేందుకే కుట్రలతో బీఆర్ఎస్ శ్రేణులపై కేసులు నమోదు చేస్తూ జైళ్లకు పంపి పబ్బంగడుపుతుందన్నారు.
దేశంలోనే ఎక్కడాలేని విధంగా ఫార్ములా ఈ – రేస్‌ను హైదరాబాద్‌లో శాంతియుతంగా నిర్వహించి ప్రపంచ స్థాయికి తెలంగాణ ఇమేజ్ను తెచ్చిన మాజీ మంత్రి కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టడం చూస్తుంటే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసేందుకు కుట్రపన్నిందని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్‌రెడ్డి అని అన్నారు. ఓటుకు నోటు కేసును దృష్టిలో ఉంచుకొని పగతోనే కేటీఆర్‌పై కేసు నమోదు చేయించారని మండిపడ్డారు.
కేటీఆర్ జోలికొస్తే తెలంగాణలో పుట్టగతుల్లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఎలాంటి తప్పుచేయని కేటీఆర్‌పై ఎన్ని కేసులు పెట్టినా కడిగిన ముత్యంలా బయటకు రావడం ఖాయమన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్వీ నేతలను ట్రైనీ ఎస్సై కిరణ్‌కుమార్, పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ పట్టణ, మండల అధ్యక్షులు వీరేశ్, మత్తాలి, మాజీ అధ్యక్షుడు కుర్వ వీరేశ్, రఫీ, మాధవ్, ఆంజనేయులు, రాజు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.