మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎక్కడ పోయినా పాలమూరు బిడ్డను నల్లమల నుంచి వచ్చాను నాకు ఆ బాధ తెలుసు ఈ బాధ తెలుసు అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాకు అన్యాయం చేస్తున్నారని.. పాలమూరు రంగారెడ్డిని 90 శాతం పూర్తిచేసి వడ్డించిన విస్తరి లాగా చేతిలో పెడితే 10శాతం పనులు పూర్తి చేయకుండా ఈ జిల్లాకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి దివంగత శ్వేత ప్రథమ వర్ధంతికి కేటీఆర్, హరీశ్‌రావు హాజరై నివాళులర్పించారు. అంతకుముందు మాజీ మంత్రి స్వగ్రామమైన ఆవంచలో విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జడ్చర్లలోని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి స్వగృహంలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ రేవంత్‌రెడ్డి తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఉంటే ఈ జిల్లా రైతాంగం.. మేము అభినందించే వాళ్లం.. ఈ ప్రాజెక్టుకు తన మామ జైపాల్‌రెడ్డి పేరు పెట్టి కూడా అర పైసా కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. ఉమ్మడి జిల్లా వెనుకబాటు తనానికి కాంగ్రెస్, టీడీపీలే కారణమని ఆనాడు చెప్పి ఈరోజు ఉమ్మడి జిల్లా ప్రజలు 12 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చేస్తే 22 నెలల్లో ఈ జిల్లాకు చేసింది ఏంటో ప్రజలకు చెప్పాలని నిలదీశారు.
పాలమూరు జిల్లాను కోనసీమలాగా మార్చి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కు దక్కిందని.. 90 శాతం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌లో రిజర్వాయర్లు అన్ని పూర్తిచేసి పెడితే ఈ 22 నెలల్లో ఎందుకు పని పూర్తి చేయలేదని రేవంత్‌ను ప్రశ్నించారు. ఒకవైపు కాళేశ్వరంలోని మెడిగడ్డ వద్ద రెండు పిల్లర్లు కుంగిపోతే అదేదో అంతర్జాతీయ సమస్యలాగా చిత్రీకరించిన రేవంత్‌రెడ్డి.. తన సొంత జిల్లా పాలమూరులో ఈ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు కంప్లీట్ చేయలేదని నిలదీశారు.
కేసీఆర్ నేతృత్వంలో పాలమూరు ఎత్తిపోతల పథకం కింద 90 శాతం పనులు పూర్తి చేసి రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసి భూసేకరణతోపాటు చేయాల్సిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వడ్డించిన విస్తరిలాగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పజెప్పి మేం కేవలం 10 శాతం పనులు పూర్తిచేసి కాల్వలు తవ్వితే నీళ్లు బ్రహ్మాండంగా తీసుకునే అవకాశం ఉన్నది. పాలమూరును పూర్తి చేయకుండా రేవంత్‌రెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తే కేసీఆర్‌కు పేరొస్తుందని కరివెన, వట్టెం, నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్లు కేసీఆర్ కట్టినవని ప్రజలకు గుర్తొస్తది శాశ్వతంగా కేసీఆర్ పేరును మర్చిపోకుండా ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని ఒక దురాలోచనతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పడావు పెట్టారని ఆరోపించారు.
కొడంగల్ లిఫ్ట్‌నకు గ్రీన్‌ట్రిబ్యునల్ స్టే
పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా రంగారెడ్డి జిల్లాకు ఆరు లక్షల ఎకరాలకు కొడంగల్ నియోజకవర్గం, నారాయణపేట కలిపి నీళ్లు ఇచ్చేందుకు అవకాశం ఉన్నా ముఖ్యమంత్రి ఏదో ఆదరా బాదరగా ఆయన తప్పుడు అడ్వైజ్ పట్టుకొని జూరాల దగ్గర సోర్స్ మార్చుకొని కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని రూ. 4000 కోట్లకు పైగా ప్రత్యేకంగా టెండర్ పిలిచారన్నారు. ఆ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు డీపీఆర్ లేదు.. పర్యావరణ అనుమతులు లేవు.. ఏదీ లేకుండా హడావిడిగా ఏదో మనసులో వేరే ఆలోచన పెట్టుకొని ఆగమాగం చేసి టెండర్లు పిలిస్తే ఏం జరిగింది మొన్న.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లేవు కాబట్టి వెం టనే స్టే ఇచ్చింది.
అలాగే రైతులు పోరాటం చేస్తా ఉన్నారు పెద్ద ఎత్తున రోడ్లెక్కుతున్నారు.. మాకు నష్టపరిహారం సరిగా చెల్లించడం లేదంటూ వాళ్లు కూడా ఆందోళన చేస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే కాకుండా.. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ పథకాలను పూర్తి చేశామన్నారు. పాలమూరును సస్యశ్యామలమే చేయడం కాకుండా శాశ్వతంగా పాలమూరు అంటే గోదావరి కోనసీమ జిల్లాల మార్చాలని బృహత్ సంకల్పంతో రిజర్వాయర్లతో సహా 90శాతం పనులు పూర్తిచేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.
కేవలం 10 శాతం పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టుకు ఎండబెట్టిన ఘనత పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డిది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక్క అర పైసా పని కూడా చేయకుండా అదే పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఆయన మామ జైపాల్‌రెడ్డి పేరు పెట్టుకున్నారు.. జైపాల్‌రెడ్డి ఈ జిల్లాకు కల్వకుర్తికి ఇరిగేషన్ వ్యవస్థకు ఏం చేశారు? ఇవన్నీ జిల్లా వాళ్లని అడిగితే తెలుస్తది పోనీ తెలంగాణ వా దంలో ఉద్యమంలో.. పోరాటంలో ఆయన ఎక్కడున్నారో మనందరికీ తెలుసన్నారు.
జైపాల్‌రెడ్డి పేరు పెట్టుకున్న ప్రాజెక్టుకు కూడా ఒక రూ పాయి కేటాయించకుండా ఆ ప్రాజెక్టును పూర్తి చేయకుండా పాలమూరును ఎండబెడుతున్నది పాలమూరు నోట్ల మట్టి కొడుతున్నది పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్‌రెడ్డి కాదా అంటూ ప్రశ్నించారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌ను బద్నాం చేయడానికి అక్కడ మేడిగడ్డలో 25 పిల్లర్లలో రెండు పిల్లర్లు సమస్య వస్తే మొత్తం అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించి రాజకీయ లబ్ధి పొందే దానికి రూ.లక్ష కోట్లు అని మా ట్లాడుతారు ఇదెక్కడి చోద్యం అన్నారు.
ఆయన మామగారు పద్మారెడ్డి స్వయంగా చెప్పినారు అది రూ.94 వేల కోట్ల ఖర్చయిన ప్రాజెక్టులో రూ. లక్ష కోట్ల అవినీతి ఎక్కడుందని స్వయంగా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో.. రెండు పిల్లర్లు దెబ్బ తింటే ఏజెన్సీయే ఖర్చుపెట్టి బాగు చేసే పరిస్థితి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వంపై పైసా భారం పడకుండా అవకాశం ఉన్న దాన్ని ముందుకు పోకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. మీ పైశాచిక ఆనందం కోసం 20 నెలలు రైతులను ఇబ్బంది పెట్టే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టడం ద్వారా కేసీఆర్ మీద కేసు పెట్టడం ద్వారా రాజకీయ కుయుక్తత ను ప్రదర్శించారన్నారు.
అక్కడ మీ పైశాచికానందం పొందారు సరే.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90% పూర్తయిన పది శాతం పనులు చేయడానికి మీకు మనసు ఎందుకు రావడం లేదన్నారు. ఈ జిల్లాలో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో ఇక్కడి జిల్లా నాయకత్వం చెబుతోందన్నారు. నాయకుల మీద కేసులు పెట్టడం.. దేవరకద్రలో ఒక మండల పార్టీ ప్రెసిడెంట్‌పై ఒక లేని కేసు పెట్టి జైలుకు పంపించారు.. వ్యాపారాలు చేసే నాయకుల మీద వారి క్రషర్లు మూయించడం.. వారి వ్యాపారాల మీదకి జీఎస్టీ అధికారులను, పోలీసులను పంపించి వేధించడం జిల్లా వ్యాప్తంగా ఒక చౌకబారు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.
పార్టీ మారినోళ్లకు చెప్పుకొనే ధైర్యం లేదు..
నిన్న కాకమున్న ఒక టీవీ ఇంటర్వ్యూలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అవును ఆ పదిమంది మా పార్టీలో చేరారు అంటూ స్పష్టంగా చెప్పారని కేటీఆర్ అన్నారు. ఈ స్టేట్మెంట్తో పీసీసీ ప్రెసిడెంట్ పార్టీ ఫిరాయింపుల కేసులో వాళ్లు మా పార్టీ వాళ్లే అంటూ.. అప్రూవర్‌గా మారినాక పీసీసీ ప్రెసిడెంట్ నేరం అంగీకారం చేసినంక ఇక ఎంక్వయిరీ ఎందుకు? ఇక చర్చ ఎందుకు? ఆ పది మంది మీద వేటు వేయడానికి స్పీకర్‌కు మొహమాటం ఎందుకని మేము అడుగుతున్నామన్నారు.
ఆల్రెడీ సుప్రీం కోర్టులో మ్యాటర్ ఉంది ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఏమనుకుంటుందంటే ప్రజల్ని మీడియాను కోర్టుల్ని, న్యాయ వ్యవస్థని కూడా చిన్న చూపు చూస్తూ మేమేదో వీళ్లతోని చిలిపి ఆటలాడి తప్పించుకోవచ్చు అనే ధోరణిలో ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటు అన్నారు. ఈ జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే పార్టీ మారారు గద్వాలలో.. వారు ఏ పార్టీలో ఉన్నారంటే చెప్పలేని ఒక విచిత్రమైన పరిస్థితి.. ఉందన్నారు. ఎట్లా ఉందంటే పార్టీ మారినోల్ల పరిస్థితి జీవితమంతా రాజకీయం చేసినా పెద్దలంతా రెండుసార్లు, మూడుసార్లు, నాలుగు సార్లు గెలిచిన వాళ్లు మంత్రులుగా పని చేసిన వాళ్లు ఏ పార్టీలో ఉన్నారు అని మీడియా వాళ్లు అడిగితే చెప్పుకోలేని దురావస్థలో ఉన్నారనీ అన్నారు. పార్టీ మారారనే నేరారోపణలో అప్రూవర్‌గా పీసీసీ ప్రెసిడెంట్ మారినారు.. కడియం శ్రీహరి నేను కాంగ్రెస్‌లో చేరానని స్పష్టంగా చెప్పా రు.
ఇవన్నీ ఆన్ద రికార్డు మీడియాతోనే చెప్పారు. కాబట్టి ఇందులో చర్చించడానికి గాని తర్కించడానికి.. పరిశోధించడానికి ఏమీ లేదు.. వీరి మీద వెంటనే వేటు వేయాలని.. న్యాయవ్యవస్థలను గౌరవించాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. పార్టీ మారలేదంటున్న గద్వాల ఎమ్మెల్యే పీసీసీ ప్రెసిడెంట్ ఒక దగ్గర కూర్చుంటే.. తెలుస్తది.. పీసీసీ ప్రెసిడెంట్ గద్వాల ఎమ్మెల్యే మా పార్టీలో చేరిండని చెప్తున్నాడు.. లేదని ఈయన అంటున్నారు. కాంగ్రెస్ కండువా వేసుకున్నాను.. కాకపోతే బీఆర్ఎస్లో ఉన్నాను అని నిస్సిగ్గుగా చెబుతున్నారన్నారు. ఒకవేళ బీఆర్ఎస్లోనే ఉంటే పార్టీ కార్యక్రమాలకు ఎందుకు హాజరుకావడం లేదు? పార్టీ ఆఫీస్‌కి ఎందుకు రావడం లేదు..? శాసనసభాపక్షం సమావేశానికి..
శాసనసభలో బీఆర్ఎస్ పక్షం వైపు ఎందుకు కూర్చోవడం లేదు? బీఆర్ఎస్లోనే ఉంటే బీఆర్ఎస్ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదు? ప్రజలను పిచ్చివాళ్లను అనుకోవడం.. ఓటేసిన ప్రజల్ని వారి విజ్ఞతకు అగౌరపరచడం కాదా? అని ఎదురుదాడికి దిగారు. మొ న్న గద్వాలలో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్ను, కేసీఆర్‌ను బూతులు తిడుతుంటే అదే వేదిక మీద ఉన్న గద్వాల ఎమ్మెల్యే పల్లు ఇకిలించుకున్నది ఎవరూ? మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డా? కాంగ్రెస్‌లో చేరిన కృష్ణమోహన్ రెడ్డా? అంటూ నిలదీశారు.. పార్టీ మారినోళ్లపై వాళ్ల ముఖ్యమంత్రి భాషలో చెప్పాలంటే రెండే రెండు లింగాలు ఉంటాయి.. ఒకటి పురుష లింగం, రెండు స్త్రీ లింగం..
వీరు ఏ లింగమో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు.. వాళ్ల కర్మ.. వీళ్లని ఎన్నుకున్నందుకు ప్రజలు బాధపడే పరిస్థితి.. ఓటేసి గెలిపించినందుకు మా కార్యకర్తల బాధపడే పరిస్థితి నెలకొన్నది. ఉన్నత న్యాయస్థానం.. స్పీకర్‌కు చెప్పింది కాబట్టి వెంటనే నిర్ణయం తీసుకోవాలని, పీసీసీ ప్రెసిడెంట్ మా పార్టీలో చేరారని ఒప్పుకున్నందున అప్రూవర్‌గా ఆయన మాటలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. పీసీసీ చీఫ్ మాట్లాడిన వాటిని కూడా మేము సుప్రీంకోర్టు ముందు పెడతాం.. మళ్లీ ఉల్టా ఫల్టా చేస్తే సుప్రీం కోర్టుకు పోతాం.. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, గద్వాల బీఆర్ఎస్ ఇన్చార్జి బాసు హనుమంతునాయుడు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.