మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/అచ్చంపేట : రాష్ర్టాన్ని భ్రష్టు పట్టించిన దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని, అచ్చంపేటలో జరిగిన జనగర్జన సభ నుంచే జైత్రయాత్ర మొదలుపెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం అచ్చంపేట పట్టణంలో నిర్వహించిన జనగర్జన సభకు కేటీఆర్ హాజరై కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్‌రెడ్డి రోజుకో తీరుగా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. ఒకసారేమో పేదరైతు కుటుంబం అంటాడు.. మరోసారి మా తాత, నాయన పోలీస్ పటేల్ అంటాడు.. ఆయన ఓ అపరచితుడు.. పొద్దున రాముగా.. సాయంత్రం రెమోగా మారుతున్నాడని ఎద్దేవా చేశారు.
‘గుడ్లు పీకి గోటీలాడుతా’, ‘పేగులు తీసి మెడలో వేసుకుంటా’.. అంటూ ఆయన మాట్లాడుతున్న భాష చూస్తే అసహ్యం వేస్తుందన్నారు. రాష్ట్రం దివాలా తీసిందని చె బుతూ తెలంగాణ పరువును బజారుకీడుస్తున్నారని ధ్వజమెత్తారు. హామీలపై నిలదీస్తే ‘నన్ను కోసుకు తింటారా?’ అని మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజె క్టు ఎత్తును పెంచుతుంటే ఇక్కడి సీ ఎం రేవంత్‌రెడ్డి ఏం చే స్తున్నాడని ప్రశ్నించాడు. ఇప్పుడున్న ఆల్మటి ప్రాజెక్టు ఎత్తును 519 మీటర్ల నుంచి ఇంకో 5 మీటర్ల ఎత్తు పెంచితే పాలమూరు జి ల్లాకు చుక్కనీరు రాని పరిస్థితి వస్తుందన్నారు. పాలమూరుకే కాదు.. తాను నిర్మించే పేట-కొడంగల్ పథకానికి నీరు రాదన్నారు.
ఒక్క మహబూబ్‌నగర్ జిల్లానే కాదు నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలకు కృష్ణానది జలాలు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇలాంటప్పుడు పాలమూరు పులి అని చెప్పుకునే రేవంత్‌రెడ్డి గర్జించాలా? వద్దా..? పిల్లిలా ఇంట్లో కూర్చోవాలా? అని ఎద్దేవా చే శారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్డీఎస్ ఆనకట్టకు అన్యాయం జరుగుతుంటే పార్టీ అధినేత కేసీఆర్ ఆనాడు పాదయాత్ర చేపట్టాడని గుర్తుచేశారు. ఈ పాదయాత్రపై అప్పటి రాయలసీమకు చెందిన ఓ ఎమ్మెల్యే కేసీఆర్ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నాడని, అతడి బ్లాక్‌మెయిల్‌కు తగ్గి ప్రభుత్వం తూములను మూస్తే బాంబులతో బద్ధలు కొడతామని బెదిరించాడని.. దీనికి కేసీఆర్ స్పందిస్తు బిడ్డా.. మా ఆర్డీఎస్ జోలికొస్తే మీ సుంకేసుల బ్యారేజ్‌ను బాంబులతో పేలుస్తామని హెచ్చరించారని, ఇది కదా గర్జించడమంటే అన్నారు.
అలాంటి దమ్ము, తెగువ రేవంత్‌రెడ్డికి లేవా? అని ప్రశ్నించారు. దక్షిణ తెలంగాణను ఎండబెట్టే కుట్రలపై ఢిల్లీలో ఉన్న రాహుల్, ఇక్కడ ఉన్న రేవంత్ ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. ముఖ్యమంత్రి పదవి కాపాడుకునేందుకే ఆయన మౌనంగా ఉన్నారని విమర్శించారు. ఏ రోజుకైనా తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది ఒక్క కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. రేవంత్‌కు దమ్ముంటే కర్ణాటక సీఎంను ఢిల్లీకి పిలిపించి రాహుల్‌తో మాట్లాడించి, ఆల్మట్టి ఎత్తు పెంపును నిలిపివేయించాలని సవాల్ విసిరారు.
లేదంటే గులాబీ దండే స్వయంగా వెళ్లి అడ్డుకుంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా తెలంగాణలో నడుస్తున్నది కాంగ్రెస్-బీజేపీ జాయింట్ వెంచర్ ప్ర భుత్వమని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. గతేడాది సె ప్టెంబర్ 27న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఈడీ దాడులు చేసి, నోట్ల కట్టలు దొరికాయ ని ప్రచారం చేశారని, కానీ ఆయన కాంగ్రెస్‌లో చేరాక ఏడాది గడిచినా ఈడీ నోరు మెదపడం లేదని, ఇదే వారి అవగాహనకు నిదర్శనమన్నారు. ఈ రెండు పార్టీలను స్థానిక సంస్థల ఎన్నికల్లో బొ ంద పెట్టాలని పిలుపునిచ్చారు.
సీఎం రేవంత్‌రెడ్డి నల్లమల పులినా? అని కేటీఆర్ ప్రశ్నించారు. దీనిపై జనం కాదు కా దు పిల్లి అని సమాధానం ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి నల్లమల పులి కాదు నల్లమల నక్క అని కేటీఆర్ సంబోధించారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చి నా ఒక్క గ్యారెంటీ కూడా సాధించలేని పొంకనాల పోకిరెడ్డి అని ఎద్దేవా చేశారు. ఆఖరికి ఆయన సొంతూరు కొం డారెడ్డిపల్లికైనా ఆరు గ్యారెంటీలు వచ్చాయా అని ప్రశ్నించారు. రైతుబంధు కేసీఆర్ రూ.10వేలు ఇస్తుంటే, రూ. 15 వేలు ఇస్తానని హామీ ఇ చ్చారని రైతులకు 22 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ.13 వేల బాకీ పడిందని గుర్తు చేశారు. కేసీఆర్ నాట్లప్పుడు రైతుబంధు వేస్తే రే వంత్ ఓట్లప్పుడు రైతుభరో సా వేస్తున్నాడన్నారు.
కల్యాణలక్ష్మి రూ.లక్ష ఇస్తే దాంతోపాటు తులం బంగారం ఇస్తానని చెప్పారని, రాష్ట్రంలో ఇప్పటి వరకు 8 లక్షల పెండ్లిళ్లు అయ్యాయి.. ప్రభుత్వం 8 లక్షల తులాల బంగారం బాకీ పడిందన్నారు. కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయిన తెలంగాణ ప్రజలు నేడు గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో కనుమరుగైన యూరియా బస్తాల క్యూ లైన్లు మళ్లీ వచ్చాయని, లైన్లలో నిలబడి రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. యూరియా ఇవ్వకుండా, రైతుబంధు వేయకుండా, వడ్లకు బోనస్ ప్రకటించకుండా రేవంత్‌రెడ్డి రైతులను అరిగోస పెడుతున్నారని విమర్శించారు.
స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి జరుగుతున్న వేళ అచ్చంపేట జనగర్జన సభను నిర్వహిస్తున్నాం.. ఇదే అచ్చంపేట నుంచి స్థానిక సంస్థల జైత్రయాత్ర కొనసాగాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆయన సోదరులు ఓటుకు రూ.5 వేలు ఇచ్చినా ఆశ్చర్య పోవాల్సిసిన అవసరం లేదన్నారు. ఆయన సోదరులు రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగానే చేస్తున్నారు. మంచిగా సంపాదిస్తున్నారు.. ఓటుకు రూ.5 వేలు తీసుకొని బాకీ కార్డును చూపించాలని అన్నారు. కేసీఆర్‌కు పేరు వస్తుందన్న అక్కసుతో బీఆర్ఎస్ హ యాంలో 90 శాతం పూర్తయిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టారని మండిపడ్డారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో మిగిలిన 10 శాతం పనులను పూర్తి చేయడం లేదన్నారు. అంతేకాదు ఆ ప్రాజెక్టుతో ఏ సంబ ంధంలేని జైపాల్‌రెడ్డి పేరు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌తో అచ్చంపేట నియోజకవర్గంలోని 90 వేల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీళ్లిచ్చిందన్నారు. మరో 70 వేల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు రూ.1,350 కోట్లతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు.
అచ్చంపేట బిడ్డ అని చెప్పుకునే రేవంత్‌రెడ్డి ఆ పథకాన్ని పూర్తి చేయకుండా పూర్తిగా పక్కన పెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ఈ రెండు ప్రాజెక్టులను పడావు పెట్టి పాలమూరు జిల్లాకు ద్రోహం తలపెట్టాడని సీఎంపై విరుచుకుపడ్డారు. మాట ఇచ్చి తప్పించుకునే నేతలను రానున్న ఎన్నికల్లో బొంద పెట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అయితే అచ్చంపేటలో ఎవరో పార్టీ వీడారని బాధపడాల్సిన అవసరం లేదని, ప్రజల అభిమానం ఉన్న నాయకుడిని కేసీఆర్ త్వరలోనే పంపిస్తారని భరోసా ఇచ్చారు. తిరిగి కేసీఆర్ సీఎం కావాలంటే అచ్చంపేటలో గులాబీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి అచ్చంపేటకు బయలుదేరిన కేటీఆర్‌కు దారి పొడవునా బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
ఆరు గ్యారెంటీ లు, 420 హా మీలతో ప్ర జలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ పతనం అచ్చంపేట జనగర్జన సభ నుంచే ప్రారంభమైందని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, అచ్చంపేట ఇన్చార్జి మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. అచ్చంపేట బీఆర్ఎస్ జనగర్జన సభలో ఆయన మాట్లాడుతూ రైతులకు యూరియా కష్టాలు చూపించిన సీఎం రేవంత్‌ను స్థానిక సంస్థ ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. కార్మికులు, రైతులు, వృద్ధు లు, వితంతువులు, దివ్యాంగులు, ఉద్యోగులు అన్ని వర్షాలకు మోసం చేసి బాకీపడిన డబ్బులను ఇవ్వాలని కాంగ్రెస్వాళ్లను నిలదీయాలని అన్నారు. రైతులకు రైతుబంధు, ఉద్యమకారులు 250 గజల స్థలం ఇవ్వలేదు, ఆడబిడ్డలకు తులం బంగారం అడగాలి, నిరుద్యోగ భృతి ఇవ్వలే దు ఇలా అనేక హామీలు ఇచ్చి అందరికీ బాకీపడిన కాంగ్రె స్ నాయకులు ఓట్ల కోసం ఇంటికి వస్తే తరిమికొట్టాలని సూచించారు.
మనకు ఇవ్వాల్సిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తూ అధికారం అనుభవిస్తున్నారన్నారు. నల్లమల బిడ్డ అని చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డి సొంతగడ్డపై ఎంత వ్యతిరేకత ఉందో జనం చూస్తే తెలుస్తుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో కాదు నల్లమలకు పంపించాలని అన్నారు. ఒక్క పిలుపుతో తరలివచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నానని అన్నారు. సభకు సక్సెస్‌కు సహకరించిన ప్రతిఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.
కాంగ్రెస్, బీజేపీ రెండు కలిపి మన తెలంగాణ భవిష్యత్‌ను నాశనం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. అచ్చంపేట సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పిలుపుతో మర్రి జనార్దన్‌రెడ్డి అచ్చంపేట క్యాడర్‌ను ఏకతాటిపై నడిపించేందుకు వచ్చారన్నారు. ఈ సభకు కృష్ణానదిలా జనం తరలిరావడాన్ని చూస్తే కాంగ్రెస్‌కు అచ్చంపేట నుంచే బుద్ధిచెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ మోసాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్వాళ్లపై కేసులు పెడతాడంటా, రౌడీ షీ టర్ పెట్టి, పోలీస్‌స్టేషన్‌లో ఫొటోలు పెడతానని అంటున్నారని అన్నారు. నిజం గా పోలీస్స్టేషన్లలో రౌడీ షీటర్‌గా ఉండాల్సిన ఫొటోలు ఎవరివంటే తెలంగాణ ప్రజలను నిలువునా దోచుంకుంటున్న కాంగ్రెస్ నాయకుల ఫొటోలు పోలీస్‌స్టేషన్‌లో ఉండాలని ధ్వజమెత్తారు. మొన్నటి వరకు మనతో ఉన్న నాయకుడు బీజేపీలో చేరాడని అన్నారు.
బీజేపీ పార్టీ దేశంలో చేయని ఘోరం లేదు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలపై ఉచ్చపోసి అవమానించిన బీజేపీలోకి వెళ్లావా అంటూ గువ్వల బాలరాజును ఉద్దేశించి ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చివరిదశలో ఉంటే కనీసం పదిశాతం నిధులు ఇవ్వలేని సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు బిడ్డ ఎలా అవుతాడని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలను ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అలాగే సీనియర్ నేత పోకల మనోహర్ మా ట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వృద్ధులు, పేదలు, రైతులకు, దివ్యాంగులు అన్ని వర్గాలకు చెప్పిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు.
ఇన్ని మో సాలు చేసిన కాంగ్రెస్‌ను కార్రుకాల్చి వాతపెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, హర్షవర్ధన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ రజనీసాయిచంద్, మాజీ చైర్మన్లు ఇంతియాజ్ ఇసాక్, మాజీ బీసీ కమిషన్ సభ్యులు ఆంజనేయగౌడ్, గెల్లు శ్రీనివాస్, ఉప్పుల వెంకటేశ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, విజితారెడ్డి, నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు.