మహబూబ్‌నగర్ విద్యావిభాగం, డిసెంబర్ 1 : బీఆర్ఎస్ చేపట్టిన గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం కలెక్టర్ బంగ్లా వద్ద ఉన్న బీసీ గర్ల్స్ హాస్టల్, టీచర్స్ కాలనీలోని బీసీ హాస్టల్‌ను నాయకులు సందర్శించారు. ఆయా వసతిగృహాల్లో మంచినీరు, భోజనం, వసతి సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లా డి వారి సమస్యలను అడిగి తెలుసుకొని రికార్డు చేసుకున్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ పాలమూరు యూనివర్సిటీ కన్వీనర్ గడ్డం భరత్‌బాబు మాట్లాడుతూ టీచర్స్‌కాలనీలోని బీసీ హాస్టల్ భవనంలో మొత్తం 308 మందికి ఇరుకుగా గదులు ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కలెక్టర్ బంగ్లా సమీపంలోని వసతి గృహంలో విద్యార్థినులకు బెడ్షీట్లు అందించలేదని, ఒక్కో గదిలో 35 మంది ఉంటున్నారని తెలిపారు.
మున్సిపాలిటీ నుంచి సరఫరా చేస్తున్న నీటిని ఫిల్టర్ చేయకుండానే అందిస్తున్నారని, మున్సిపల్ డ్రైనేజీ పరిశుభ్రంగా లేకపోవడంతో నిత్యం దోమలబెడద ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ పట్టణ ప్రెసిడెంట్ సత్యపాల్, వైస్ ప్రెసిడెంట్ గణేశ్, మనీశ్‌గౌడ్, తిరుమల్‌నాయుడు, రామకృష్ణ, శ్రీకాంత్, రాజగోపాల్, భరత్ తదితరులు పాల్గొన్నారు.